తెలిసీతెలియని విషయాలపై పోపుత్వమించడంలో నేను మాహిర్ని అయ్యినట్టు అనిపిస్తూంటుంది అప్పుడప్పుడూ. సరే, ఆ విషయం పక్కన పెడితే..
రాబోతున్న బాక్యార్డ్ అల్ట్రా ప్రస్తావనలో నీ మెంటల్ స్టేట్ ఎలా ఉందని నేథన్ ప్రశ్నిస్తే, దానికి సమాధానం వెతుకుతూ ఇంకో సంభాషణలో పాల్గొన్నప్పుడు ఒక ఇన్సైట్ చేజిక్కింది. వెంకట్రావ్‌గారు రిబ్బన్ఫామ్లో తరుచూ ప్రస్తావించే పుస్తకం జేమ్స్ పీ. కార్స రాసిన ఫైనైట్ & ఇన్ఫినిట్ గేమ్స్. ఆ పుస్తకం నేనింకా చదవలేదు కానీ ఆ టైటిల్లో ఉండే డిస్టింక్షన్ గురించి నేను తెలుసుకున్నదేంటంటే కొన్ని ఆటలు (ఇక్కడ ఆట అనే పదం ఫార్మల్ మాథెమాటికల్ పార్లాన్స్ లో నిర్వచించబడుతోంది) గెలవటానికి ఆడితే కొన్ని ఆటని పొడిగించేదానికి మాత్రమే ఆడతారని. ఆ ఫ్రేమ్‌వర్క్‌ని నా అల్త్రా మారథాన్‌కి అన్వయిస్తే- మారథాన్ పరిగెత్తడం ఒక విధంగా చూస్తే ఫైనైట్ గేమే అయినా, కాస్త ఫిలసాఫికల్‌గా ఆలోచించగలిగితే అది ఇన్ఫినిట్. పట్టుదలతో, కండలు బిగించి, ఊపిరి బిగబట్టి నేను అనుకున్న గోల్‌ని చేరుకోగలనేమో, అలా 'విజయం' పొందగలనేమొ కానీ నేను ఇన్నాళ్ళుగా ట్రెయిన్ చేసింది అందుకోసం కాదు. ఆర్ పర్హాప్స్ అందుకోసమే కాదు. అసలు పది గంటలు పరిగెత్తడం ఎలా ఉంటుందో, నా మనస్సు-మెదడు-శరీరం ఎలా ఫీల్ అవుతాయో, వాటి ద్వారా యేయే కొత్త అనుభవ ప్రదేశాలు నేను పర్యటించి వస్తానో తెలుసుకోడానికి. పూర్తి చేయడం వల్ల వచ్చే సంతృప్తి, పెరిగే అత్మాభిమానం, ముగ్గురు నలుగురి నుండి వచ్చే మెప్పుకోలు - ఇది ఫైనైట్ ఆస్పెక్ట్, స్టేట్|స్టేటస్‌కు సంబంధించినవి. అంతే కాదు అలా పరిగెత్తడానికి నేను పరిష్కరించాల్సిన 'సమస్యలు'- స్త్రెంగ్త్ & ఎండ్యురెన్స్ ట్రైనింగ్, న్యూట్రిషన్, మెంటల్ ఛాలెంజెస్ మొ|| అన్నీ ఫైనైట్ గేమ్సే అయినా వాటన్నిటి తుది ఉద్దేశ్యము జీవితం అనే ఇన్ఫినిట్ గేమే.
ఆకలి రాజ్యం క్లైమాక్స్‌లో కమల్ హస్సన్ పాత్ర అంటుంది, "ఎలాగోలా బ్రతకాలి అంటే ఎలాగోలా బ్రతికేద్దును, ఇలాగే బ్రతకాలి అనుకున్నాను.. అది వీలుపడటం లేదు". గత కొన్నేళ్ళుగా నేనీ లైన్‌ని ఫ్లిప్ చేసి ఒక జీవిత సత్యాన్ని రాబాట్టాను. "ఇలాగే బ్రతకాలి అంటే గొడవ కానీ ఎలానోలా బ్రతికేయడం అంత కష్టం కాద"ని. అంటే ఆదర్శాలు లేకుండా మానాభిమానాలు వదిలేసి బ్రతకమని కాదు. ఒకటి మన ఆదార్శాలని కూడా కాస్త స్కెప్టికల్గా చూస్కోమని- ఎవరు చెప్పిందో, ఎప్పుడో అనుకున్నదో ఇప్పుడు వర్తించాలి అనుకోవడానికి కారణం చాలా సార్లు అహం, అజ్ఞానం, అడాప్ట్ కాకపోవడం అని తోచి. రెండు ఈరోజు ఓడినా రేపు గెలవాలంటే ముందు ఈరోజు ఎదురుకున్న కష్టం నుండి బయటపడి బతికి బట్టకట్టాలని.
రచయితలకు సూచనలు టైప్ పోస్ట్స్‌లో మళ్ళీ మళ్ళీ తారసపడే లైన్ "కిల్ యువర్ డార్లింగ్స్". అది మనం రాసిన వాక్యాలకి ఎంతగా వర్తిస్తదో మన ప్రీవియస్ సెల్వ్స్కి కూడా అంతేగా వర్తిస్తదేమో. మన పట్ల మనకున్న ఇమేజ్, అది గతానిదైనా వర్తమానానిదైనా, మనల్ని మోహించి మభ్యపెట్టే అవకాశం ఉంది. పర్సనాలిటీ అనేది అప్పుడప్పుడూ పనికొచ్చే ఫిక్షన్. దాన్ని చాలా వివేకంతో హాండ్ల్ చేయాలి. లేకుంటే అది మనల్ని మోహరించి, మనల్నే ఖైదు చేస్తుంది. "ఇది నేను, ఇలా ఉండటం నా అలవాటు, నాకు అవి తెలియవు" -- ఇలాంటి ప్రకటనల్లో సత్యం ఎంత ఉన్నది అన్నది ప్రశ్న కాదు, అది నిన్ను ఏం చేయనివ్వకుండా ఆపుతోందన్నది పెద్ద ప్రశ్న. దాని ఆపర్చ్యునిటీ కాస్ట్ ఏంటని. మంచి-చెడుల కన్నా సబబు-కాదు అనేది బెటర్ ఫ్రేసింగ్.
"నిన్ను నువ్వు పునర్నిర్మించుకోవాలంటే విరగ్గొటుకునే నేర్పుండాలి", అని రాశారు శివారెడ్డి గారు. చాలా ఏళ్ళు నాకు నేను వేసుకున్న చిక్కుముళ్ళల్లోని ఆకృతుల్ని చూస్తూ నిశ్చేష్టుణ్ణైనాను, ఇంకొన్నాళ్ళు వాటిని ఏకధాటిగా తెంపేసే మార్గం చూపే నాధుణ్ణి వెతికాను, మరి కొన్నాళ్ళు ఒకటీ ఒకటీ విప్పే విధానల్ని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఈ మధ్య అనిపిస్తోంది ఒక ఆలోచనా ధోరణి సృష్టించిన సమస్యలను అదే పరిష్కరించలేదని. ఏమరపాటుగా ఉంటే ఆ పర్టిక్యులర్ చిక్కుముళ్ళ కాన్ఫిగరేషనే మన పర్సనాలిటీ అనుకొని సర్దిచెప్పుకుంటాం, ఆప్యాయతని పెంచుకుంటాం. అద్వైతవాది నువ్వు అవేవీ కావు అన్న అవగాహనే జ్ఞానం అంటాడేమో. కానీ ఒక భౌతికవాదిగా నా ఇంక్లినేషన్ దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. కాంబినేటోరియల్లీ స్పీకింగ్, అసంఖ్యాకర ముళ్ళ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. నా డ్రైవింగ్ ఫోర్స్: బతికున్నాళ్ళల్లో వీలైనన్నింటిని అనుభవించడం. అలా చేయాలంటే ప్రతిరోజూ ఇది నేను అని నిర్వచించుకొని దాని చుట్టూ గిరిగీసుకోవడం కాకుండా బయటక కనబడిన దాన్ని ఆహ్వానిస్తూ ఇదీ నేనే అంటూ ఆ గీతని ఇంకాస్త చెరిపేసుకోవడం.
1 comment:
Very well said
Post a Comment