I published a story after a long time; Over 8 years since 90s Blues was published in September 2014. It feels very good. For all my guardedness in exhibiting most things I do, I couldn't resist talking about this story while it was in progress and couldn't stop myself from sharing it on WhatsApp when it got published. It felt like a big milestone (the reservations to this exact feeling represented in the story notwithstanding), and I am deeply happy and genuinely grateful to a lot of people.
The following might read like a cheesy faux Oscar speech but I feel indebted to a lot of people for finally getting this out; It does feel like a huge burden has been taken off my chest.
To Meheranna, for the intitial discussion which led me to attempt writing a story after a long time, and parts of which actually appear in the story.
To Purnima garu, for her goodness and inspiring work ethic, and also for the love and encouragement she has for me.
To Sravani, for being the first listener and interlocutor on that long trip to Oran Park, and also for the pride with which she celebrated even minor upgrades.
To Amma, for allaying my fears when I sent her the draft with some trepidition, and for objectively assessing and conveying bits both good and bad.
To Shouri, for reading one of the earlier drafts and telling me that he could empathise, atleast to a certain extent, with what the narrator was going through.
To Dheeraj, who has been most fundamental in bringing this to fruition, and for infusing my life with more youthful preoccupations, frustrations and grand questions.
To Madhav garu, who's first long, detailed, intense response was more flattering than disappointing, and for the time and thought he spent on the myriad messes I called drafts.
To Bhajji, for bringing a certain prosaic charm to proceedings, and for patiently listening to me go on about 'non-events' and 'transcribing life-like digressive conversations' despite suspecting that I didn't really know what I was talking about.
This is also the first time I did quite a few drafts and I'm going to share a few outtakes, which I feel are interesting but didn't fit in the final version, at the end.
“నేను కథలు రాయలేను. దేని గురించి రాయాలి? చుట్టూ ఉన్న ప్రపంచం
గురించి ఏం తెలుసు నాకు? లక్షలు ఖర్చుపెట్టి చేసే పెళ్ళిలో అతుకుల చొక్కా
వేసుకొని సర్వ్ చేసే ఒక వెయిటర్ కుర్రాడి గురించి రాయాలనుకున్నా
నిజాయితీగా రాయలేను. అది నా అనుభవసత్యం కాదు. అమెరికాలో మా వలస జీవితాలకి
ఇండియాలో ఉండుంటే ఉండే జీవితానికి వ్యత్యాసం గురించి రాయొచ్చు. కానీ అవి
కథలు కావు, నాన్-ఫిక్షన్‌లో వచ్చే హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీస్. రూపురేఖలు
భాష ఆహార్యం బట్టి వచ్చేవి సమాజం నుండి అరువు తెచ్చుకున్న సెకండ్ హాండ్
అసంప్షన్స్ అండ్ ఇంప్రెషన్స్. ఇంకో మనిషి లోపల ఏం జరుగుతుందో ఊహించగలనే
కానీ ఇది అని తెలుసుకోలేను. ఎందుకంటే అందరిలానే నేనూ నా బుర్రలోని ఖైదీనే…”
“నేనడిగిన ప్రశ్న ఏంది? నీ సోది ఉపన్యాసం ఏందిరా?” నవ్వుతూ అన్నాడు
సుదర్షన్ సార్. “నువ్వు ఎందుకు రాయాలి? అని అడిగినా. ఎందుకు రాయలేవని కాదు.
అది మొదటి ప్రశ్న. నువ్వు రాసినాక, పాఠకుడు నీ కాలర్ పట్టుకొని అడిగే
ప్రశ్న – నాకేంటి? నేనెందుకు చదవాలి నీ కథని, నేనెందుకు వినాలి నీ సోదిని?
అని. ఏంటి దానికి నీ సమాధానం?”
“అంటే సార్, నాకు రచయిత అనిపించుకోవాలని కోరిక సార్. నాకు తెలుసు ఏం
రాసినా ఎవరూ పట్టించుకోరని. పోని చదివి నచ్చినా అయిదు నిమిషాల్లో వాళ్ళ
పనుల్లో, జీవితంలో వాళ్ళు మళ్ళీ నిమగ్నమైపోతారని. ఎవడో పాఠకుడు ఖర్మకాలి
నిజంగా వచ్చి, ‘భలే ఉంది భయ్యా కథ’ అన్నా నేను దాన్ని మనస్ఫూర్తిగా
తీసుకోలేను సార్, ఇంపోస్టర్ సిండ్రోమ్ అడ్డొస్తుంది. ఆల్‍స్టెయ్‍ర్
మెకెన్‍లైర్ అన్నట్టు మనం కథలు చెప్పుకునే జాతి. కథల వల్ల నాగరికత, కథల
వల్ల సమాజం, కథల వల్లనే మనం అనుభవించే ఈ గొప్ప అంతఃజీవితం. ఆ గొప్ప పరంపరలో
పాలుపంచుకోవాలన్న కోరిక. కొందరికి ఎలా అయితే డాక్టర్ అయ్యి సమాజానికి సేవ
చేయాలనుంటుందో, నాకలా కథకుడై చేయాలనుంటుంది. ఫాస్టర్ వాలెస్ అన్నట్టు
మోనోలాగ్ ఇన్ మై హెడ్…
“అబ్బో! ఇంకా? ఇంకేమైనున్నయారా పెద్ద పెద్ద పేర్లు నామీదేయడానికి? ఆయనేమన్నడు, ఈయనేమన్నడు కాదురా. నువ్వేం అంటున్నావో చెప్పు.”
“అంటే, సార్…”
“అసలెందుకు రాయాల్రా నువ్వు?” ఉన్నట్టుండి మారిపోయింది సార్ గొంతు.
ఉలిక్కిపడ్డాను. “చెప్పరా!” అంటూ రెండడుగులు ముందుకేశాడు. ఖాళీ క్లాసులో
ఆయన స్వరం దద్దరిల్లింది. అదేంటి, కాలేజిలో మేమిద్దరమే ఉన్నాం?
“సార్, అంటే నేను ప్రపంచం గురించి, జీవితం గురించి తెలుసుకొని అనుభవం సంపాదించి అది చెప్తు…”
“హాఁ! ఏం తెలుసు నీకు జీవితం గురించి?” అన్నాడు పక్కనే వచ్చి నిలబడుతూ.
“సార్, అంటే మ-మన అనుభవాలు ఆలోచనలు నలుగురితో పంచు-పంచుకోవాలని,”
అన్నాను తల పైకెత్తి ఎర్రబడుతున్న ఆయన మొహంలోకి చూస్తూ. షర్టు చమటతో
తడిసిపోయింది, కాళ్ళు వణుకుతూ లేచి నించున్నా.
“ఏమన్నావురా?” అన్నాడాయన నా మీదికొస్తూ. బెంచ్ బయటికొచ్చి వెనక్కి
అడుగులేశాను. “సార్ అది, తెలీక… స-సారీ” అన్నాను వెనక్కి నడుస్తూనే. ఆయన
మీదికొస్తూనే ఉన్నాడు.
“నీ ఆలోచనలు. నీ అనుభవాలు. ఎవడివిరా నువ్వు? ఏంటి నీ పంచుకోవాల్సినంతటి అనుభవాలు?”
వీపు గోడకి తగిలింది. గొంతులోంచి మాట పెగల్లేదు. ఆయన ఊపిరి
పీల్చుకున్నాడు. కళ్ళు మూసి తెరిచాడు. “తప్పదు” అని గొణుగుతూ వెనకాలనుండి
కత్తి తీశాడు. నా వొళ్ళు చల్లబడిపోయింది. భయం గుండెని పట్టేసుకుంది,
అరుద్దామంటే గొంతు పెగలడంలేదు. కసక్కని కత్తి పొట్టలో దిగింది. చటుక్కున
మెలుకువొచ్చి కళ్ళు తెరిచా. ఎక్కడున్నానో స్ఫురణలోకి రావడానికి అరనిమిషం
పట్టింది. ఫ్లైట్ అంతా మసక చీకటి.
ఫ్లైట్ కుదుపులకు ‘ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్’ సైన్ వెలిగింది. పక్క సీట్లో కావ్య మంచినిద్రలో ఉంది.
కావ్య వాళ్ళ తమ్ముడి పెళ్ళి పనుల్లో బిజీ అయిపోయింది. నేను కాసేపలా
వాళ్ళింటికెళ్ళొచ్చినా, రోజంతా ఇంట్లో అమ్మ నాన్నలతోనే. హైదరాబాద్‌లో
ఇప్పుడెవరూ ఫ్రెండ్స్ లేరు. వాణి పిన్ని సిఫార్సు మీద అమ్మ ఆన్‌లైన్‌లో
చేస్తున్న రైకీ కోర్స్ గురించి ఒక సాయంత్రం చెప్పింది- వైటల్ ఎనర్జీ, టచ్
హీలింగ్, ఆరా గురించి, ఎన్నో ఏళ్ళ నుండి సాధన చేస్తున్న వాళ్ళ అనుభవాల
గురించీ. ఇలాంటి టాపిక్స్ మీద అమ్మతో ఒకప్పుడు వాదించినంత ఉత్సుకతతో
వాదించలేదు. పెద్దగా అర్థం కాకపోయినా విని కొన్ని ప్రశ్నలేశాను.
బట్టల షాపింగ్ కోసమని కావ్య, కార్తీక్‌లతో మాల్‌లో తిరుగుతుంటే మురళన్న నుంచి ఫోన్.
“అన్నా ఎలా ఉన్నారు?”
“బాగున్నానబ్బ. నువ్వెలా ఉన్నావు? సెటిల్ అయ్నరా? జెట్ లాగ్ పోయిందా?”
“హాఁ అన్నా అంతా ఓకే. అంతా మంచిగేనా?”
“ఏం లేదబ్బ, బుక్ రిలీజ్ ఫంక్షన్ వారం పోస్ట్‌పోన్ అయింది.”
“అయ్య, ఎందుకన్నా?”
“ఇంకా పుస్తకాలు రెడీ కాలేదు. ఇంకో నాలుగైదు రోజులు పడుతుందంటున్నారు. అదే నెక్స్ట్ సాటర్‌డే అనుకుంటున్నాం.”
“అరే, అన్నా! ఆరోజే మా బామ్మర్ది పెళ్ళి. అయ్యో!”
“హాఁ, అదే నువ్వన్నట్టు గుర్తు. పర్లేదులేబ్బా ఆ తర్వాతే కలుద్దాం, ఉంటావుగా ఇంకొన్నాళ్ళు?”
“ఉంటాగానీ చాలా ఎక్సైటెడ్‌గా ఉండె మీ ఫంక్షన్ కోసమని. సక్స్ దట్ ఐ కాన్ట్ అటెండ్.”
“ఏం పర్లేదులే, ఫంక్షన్ అంటే పెద్ద ఫంక్షనేం కాదుగా. మనవాళ్ళే
పదిమందుంటారు, వాళ్ళనెప్పుడైన కలవచ్చు. సరే, నీ హడావిడి తగ్గిన తర్వాత కాల్
చెయ్యి, ఉంటాను.”
చికాగ్గా అనిపించింది. ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ఈవెంట్.
నన్ను ఎయిర్‌పోర్ట్‌లో దింపడానికొచ్చిన కావ్యనడిగా, “కథలు మనం సృష్టిస్తామా? లేక వాటిని జీవితాన్ని చూస్తూ పరిశీలిస్తూ కనుగొంటామా?”
తను నవ్వి, “కాసేపు బుర్రకి రెస్ట్ ఇవ్వరా బాబు. ఎంజాయ్ యువర్ గోవా ట్రిప్” అని హగ్ ఇచ్చింది.
“ఏడున్నవ్ బే?” ఫ్లైట్ లాండ్ అవ్వగానే రోహిత్‌కి ఫోన్ చేశా.
“ఎక్సిట్ దగ్గర వెయ్ట్ చేస్తున్న.”
లగేజ్ తీస్కొని బయటికొస్తూంటే సరిగ్గ ఎక్సిట్ గేట్ పక్కనుంచి పెద్దగా
నవ్వుతూ వచ్చి గట్టిగా వాటేసుకున్నాడు. “ఎట్లున్నవ్ మామ్స్? జిమ్‌లోనే
బతుకుతున్నవారా ఇట్లా కండలు పెంచినవ్?”
ఎయిర్‌బీఎన్‌బీకి కాబ్ తీస్కొని హర్షకి ఫోన్ చేశాం. “ఏడున్నవ్ బే?”
“అరేయ్ నేనింక హుబ్లీ భీ చేరుకోలే. కనీసం అయిదైతది నేన్రాటానికి, మీర్ స్టార్ట్ జేయుర్రి.”
రూమ్ చేరి చూస్తే ప్లేస్ చెత్తగుంది. “మాక్కీ! ఫోటోలకీ రియాలిటీకి జమీన్
ఆస్మాన్ ఫరక్. పద మానేజర్‍గానికో డోసిచ్చొద్దాం!” గయ్యిమన్నాడు
రోహిత్గాడు. మానేజర్‌తో కాసేపు గొడవ పెట్టుకున్నాక చేసేదేం లేక చెకిన్ చేసి
లంచ్ చేయటానికి బీచ్‌కి వెళ్ళాం.
“ఏమైంది ఇష్లీన్ విషయం? ఒప్పుకున్నదారా అమ్మ?”
“లేదురా, ఎప్పట్లెక్క అదే గొడవ. తెలుగోళ్ళు కాదు, హిందువులు కాదు.”
“మరేం చేద్దాం అనుకుంటున్నవు?”
“ఏం లేదు చేయటానికి, వెయిట్ చెయటమే. లక్కీలీ, వాళ్ళ పేరెంట్స్ సపోర్టివ్ కాబట్టి నడుస్తోంది. ఒప్పుకుంటదిలే.”
నెమ్మదిగ తినీ తాగీ, ఇళ్ళకి ఫోన్లు చేస్కొని, ఆక్టివా అద్దెకు తీస్కొని,
మందూ సిగరెట్లు కొనుక్కొని రూమ్‌కి తిరిగెళ్ళేసరికి సాయంత్రమైంది.
అప్పటికొచ్చాడు హర్ష.
“అరె ఏం మనిషివ్రా నువ్వు? తలల దిమాగ్ ఉన్నోడెవడన్న బండి మీదొస్తడా బే?”
“అదట్లుంచు గాని ఈ రూమేందిబే గిట్లుంది. నువ్వేదో పెద్ద ఎన్నారై గాన్వి
క్రేజీ రూమ్ తీస్తవంటే ఏంటిదిరా గిది? థూ దీనమ్మ, దీన్కన్న నా రూమే
మంచిగుంటదిగారా!”
ముచ్చట్లు, మందు, సిగరెట్లు, మంచింగు, మధ్యలో ఒక చిన్న జాయింటూ.
డ్రింక్స్ పట్టుకొని పదకొండు గంట్లకు మిద్దె మీదికెళ్ళాం. సముద్రపు హోరు
లీలగా వినబడుతోంది.
“ప్రియాంకతో అఫైర్ ఎట్ల నడుస్తోందిరా?”
“ప్రియాంక లేదు బొంగాంక లేదు!” వాడి మాట తడబడుతోంది.
రోహిత్ వంక చూశా. వాడు చిన్నగా తలూపాడు.
“ఏమైంది మామా?”
“ఏమైతది బే, మొగుడు పిల్చిండు చెక్కేసింది డబ్లిన్‌కి. అదేమన్న నా పెళ్ళామారా నాతోనే ఉండనీకె ఎప్పటికీ.”
“అంటె నీకు తెల్సుగారా ఎట్లైన షార్ట్ టర్మేనని…”
“ఇప్పుడ్నేనేమంటున్నరా? దెంగేషిందది ఏంజేయమంటవ్ నన్ను?”
రోహిత్ నేనూ ఒకరి మొఖాలొకళ్ళం చూస్కున్నాం. నాకేమన్నా చెప్పాలనిపించింది
కానీ ఏమనాలో తెలీలేదు. భుజమ్మీద చేయి వేద్దామనుకొని ఆగిపోయా. చాలాసేపు
అలానే ఎవరి ఆలోచనల్లో వాళ్ళం ఉండిపోయాం.
హర్షగాడు రెండు పెద్ద పెద్ద జాయింట్లు రెడీ చేసి మమ్మల్ని నిదర్లేపాడు.
“కసౌల్ మాల్ ఇది, ఆఫిస్ ఫ్రెండ్ స్కోర్ చేశిండు లాస్ట్ వీక్. క్రే-జీ
ఉన్నది.”
స్మోక్-అప్ చేసి చాన్నాళ్ళైనందుకోనేమో ఒక్క జాయింట్‌కే నేనౌటు. వెనక్కి
జారి గోడకానుకున్నాను. శరీరమంతా ఒక తిమ్మిరిలాంటి వెచ్చతనం. ఒళ్ళు
బరువెక్కింది, కుడిచెయ్యి దురదపెడితే గోక్కుంటున్నా. వాళ్ళిద్దరూ నా వంక
తిరిగారు. నవ్వటం మొదలుపెట్టా. వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు.
“స్టోన్‌డ్ సాలెగాడు.”
“ఈడు మనతానె ఉంటేనే మంచిది. కనీసం నవ్వుతుంటడు.”
కరెంటు పోయింది, ఫాన్ మూల్గుతూ మూల్గుతూ ఆగడం వింటూంటే ఇంకా
నవ్వొచ్చింది. కిటికిలోంచి కొబ్బరిచెట్టు మట్ట గాల్లో ఊగుతోంది. కుడీ ఎడమా
కుడీ ఎడమా… కుడికాలి పైన ఎండ పడి సుర్‌సుర్‌మంటోంది. కాలు పక్కకు
జరుపుదామనుకున్నాను. జరిపాను. జరగలేదు. అది నామాట వింటల్లేదు. రూమ్ అంతా
తెల్లగా పొగ. రోహిత్గాడు చేతులు తల కింద పెట్టుకొని మంచంమీద పడుకునున్నాడు.
హర్షగాడు ఫోన్లో ఏదో చూసుకుంటున్నడు. మెడ కిందినించొకటి చెమట చుక్క జారి
పొట్టమీదనుంచి ఇంకా కిందకి, చక్కిలిగిలి పెడితే గట్టిగా నవ్వొచ్చింది.
కడుపులో గుర్రుమంది.
నెమ్మదిగా లేచా. శరీరం మోయలేనంత బరువుగా ఉంది. పట్టుకోలేనంత తేలికగానూ
ఉంది. రెయ్‌లింగ్ పట్టుకొని చిన్నగా మెట్లు దిగా. కింద షాప్‌లో చిప్స్,
బిస్కెట్స్, కూల్‌డ్రింక్ కొని వెనక్కు తిరిగితే ఐస్‌క్రీమ్ బండి కనబడింది.
నాలుగు చాకోబార్లు తీసుకొని పైకొస్తూంటే చేతిలో ఐస్‌క్రీమ్ చలికి షాక్
కొట్టినట్లయింది. అక్కడే మెట్లమీద కూర్చొని రెండు చాకోబార్లు గబగబా తిన్నా.
అమ్మయ్య. ప్రాణం కుదుటపడింది. రూమ్‌లోకెళ్ళా.
“ఇంతసేపెటుపొయినౌరా?”
“ఇంతసేపేంది బే?”
“అరేయ్ పకోడి, నువ్వు పొయ్యి అరగంట దాటింది. ఎంత గలీజ్ ట్రిప్ ఐతున్నవ్ రా!”
టైమ్ చూస్తే నాలుగు దాటింది. “అమ్మ! కదిలనవ్ రా! పద బీచ్ పోదం!” ఈ హర్షగాడికి ఇంత టాలరెన్స్ ఏందో! సాలెగాడు.
ఇంకో జాయింటు కొట్టి బీచ్‌కెళ్ళాం. అక్కడొకచోట నీళ్ళల్లో దిగి చాలాసేపు
వాలీబాల్ ఆడాం. పొద్దు వాలుతోంది. అంతా బంగారు రంగు వెలుతురు పరుచుకుంది.
హై ఇంకా మొత్తం దిగలే కానీ ఫుల్ ట్రిప్‌లో కూడా లేని ఒక అద్భుతమైన స్థితిలో
ఉన్నా. నీళ్ళల్లో నా ఒంటిమీద ప్రతీ కణం తెలుస్తోంది. నీళ్ళని వెలుతుర్ని
గాలిని పరిసరాల్ని, చుట్టుపక్కలున్న పిల్లల అరుపులని, నా అనుభవాల్ని
చూస్తున్న జీవిని – ఇవన్నీ ఒకేసారి గ్రహించగలుగుతున్నా. గుండె నిండింది.
భేంచోత్, ఇదీ జిందగీ!
“నువ్వు కాని నువ్వు, నువ్వే నువ్వు. నువ్వే అయిన నువ్వు. నువ్వెన్నటికీ
కాని నువ్వు. ఇన్ని అస్తిత్వాల మధ్య…” పెద్దగా చదువుతూ నీళ్ళల్లోకి ఎగిరి
దూకా.
అక్కడే పక్కన శాక్‌లో బీరు, భోజనం ఆర్డర్ చేసి కూర్చున్నాం సందెమాటు వెలుగులో. ఎక్కువ మౌనం మామధ్యలో.
“అరే, ఇందాకేందిరా ఒర్లినవ్? నీళ్ళల్ల దూకతా?”
“ఇంకేముంటది. మురళి కవిత్వం అయుంటది. అరే, ఏమైన రాస్తున్నవ్‌రా మల్ల?”
“లేదు. ఏం రాయలే. ఎందుకో రాయలేకపోతున్నా. కాని ఆలోచిస్తున్నా. నాకు ఈ
మూమెంట్స్ కాప్చర్ చేయాలని మస్త్ కోరిక. దిస్, నథింగ్‌నెస్- ఈవెంట్‌కి
ఈవెంట్‌కి మధ్యలో స్పేస్.”
“అంటే?”
“అంటే, ఇప్పనిదాక ఆడినం. ఇప్పుడిక్కడ కూచున్నం… మన సినిమాలు, మన కథలు,
మన జీవితంలో ఈవెంట్స్ గురించే ఎందుకుంటైరా? ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, చావు,
అపార్థం చేస్కొనుడు, మళ్ళా కలుసుడు. లవర్‌కి కాన్సర్ వచ్చుడూ, సచ్చుడూ.
ఇట్లాంటి ఈవెంట్సేనారా లైఫంటే? అవేవీ లేకుంటే లైఫ్ లైఫ్ కాదారా? సినిమాల్లో
చూపించే ట్రాన్స్‌ఫర్మేషన్‌లు, కెథార్సిస్‌లు మనకెన్నడన్న అయితయారా? డూ
ఉయ్ ఎవర్ చేంజ్?
“ఇన్‌ఫాక్ట్, నిజం మార్పు ఎప్పుడన్న చాలా స్లో, సబ్లిమినల్. మనకే
తెలవదు. లైఫ్‌లో ఎంత పెద్ద ఈవెంట్ గాని – పెళ్ళి, పిల్లలు, చావు, ఓటమి
గెలుపు ఏమన్న గాని, ఆ ఇంపాక్ట్ కొన్ని గంటలు రోజులు మాత్రమే ఉంటది. దెన్
ఉయ్ రివర్ట్ బాక్ టు ది మీన్. మన లైఫ్‍ల ఒక రకమైన లో-లెవెల్ అసంతృప్తి మన
సాధారణ స్థితి. మన డైలీ రియాలిటీ ఏంటంటే రోజూ తింటం పడుకుంటం, టి.వి.
చూస్తం, పాలిటిక్స్ మాట్లాడతం, డబ్బుల గురించి ఆలోచిస్తం, ప్లాన్స్
వేసుకుంటం, వేసుకున్న ప్లాన్స్ రిసల్యూషన్స్ ఫెయిలయితే ఫ్రస్ట్రేట్ అవుతం.
అంతకి మించి డ్రమటిక్‌గా ఇంకేం కావు. నేను దాని గురించి మాట్లాడుతున్నా. ది
ఎవ్రీడే బిజ్‌నెస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం పొద్దుననుండి చేసింది ఎంత మజా
వచ్చింది, ఎంత మెమరబుల్ డే. కానీ సినిమాల్లో ఇదే ఒక మాంటేజ్‌లో తీసి
పడేస్తారు. ఇవి వాళ్ళకి మైనర్ మూమెంట్స్. కానీ మనకి, కనీసం నాకు, ఇది ట్రూ
మెటీరియల్ ఆఫ్ లైఫ్ అనిపిస్తది.”
“అరేయ్! ఈనికొక పెగ్గన్న ఇవ్వు. నా పీకన్న పిసుకు.”
“నువ్వుండు బే. జోకర్ లెక్క చేయక్. అప్పనికీ నువ్వేందో ఆర్డినరీకి
డెఫినిషన్ అయినట్టు. అరే సూరిగా! నువ్వు చెప్పింది నాకర్థమైంది కాని,
సినిమా, ఎనీ స్టోరీ, ఈజ్ నాట్ అబౌట్ స్టాటిక్ ఆర్ డైనమిక్. మనం మంచిగ
ఎంజాయ్ చేసినం. ఎవరైన విడియో తీసి చూస్తే ఒకసారి చూసి నవ్వుకుంటం. కాని
రూమ్‌లో నువ్వు కెమెరా పెట్టి, ప్రతీ మూమెంట్ కాప్చర్ చేసి మన ట్రిప్
మొత్తం అట్లనే లైవ్ లెక్క తీస్తే చూస్తవా? చూడగల్గుతవా? వాట్స్ ద పాయింట్
మాన్? అంటవా అనవా? మరి, అదే మల్లీ మల్లీ చూపిస్తే చూస్తవారా, అది ఎంత మన
లైఫే అయినా? ఎందుకంటే సినిమా అలా వర్కౌట్ కాదు, అసల్ ఏ ఆర్ట్ అలా వర్కౌట్
కాదు. రోజ్గారీ జీవితాన్ని అట్లనే చూడటానికి ఎవడూ సినిమాల్కిబోడు. జనాల్
సినిమాలు చూసేది వాళ్ళ లైఫ్‌లో మామూల్గ జరగని విషయాలు చూసి థ్రిల్
అవ్వటానికి.”
“అంటే రొటీన్ లైఫ్, రొటీన్ ఈవెంట్స్ ఆర్ నాట్ వర్దీ ఆఫ్ ఆర్ట్?”
“నో. నేనట్ల కూడ అంటలే. ఎంత ఆర్డినరీ ఈవెంట్ అయినా నువు నరేట్ చేయడం
మొదలుపెట్టంగనే ఎలివేట్ అవుతది. ఇందాకేమన్నవ్? ఈవెంట్‌కీ ఈవెంట్‌కీ మధ్య
స్పేస్. ఆ స్పేస్ నువ్వు గుర్తించనంతసేపే అది నాన్-ఈవెంట్. నువ్వు దాన్ని
అక్నాలెజ్ చేయంగనె అదీ ఒక ఈవెంట్ అయితది. నార్మల్ లుక్స్ అబ్‌నార్మల్.
ఆర్ట్ అంటేనే అది గదర. నేననుడేందంటే ఆర్ట్ ఏందో కాదో మనకు ముందే తెలియదు,
నువ్వు అది చేసి చూసేదాక. నేనో గొప్ప సినిమా తీస్త, గొప్పపాట రాస్త, మస్త్
ట్యూన్ కడ్త అని ఎవడైన మొదలెడ్తడ్ర? వాల్లది చేస్తరు. అది గొప్పగయ్తదా కాదా
అన్నది తర్వాతెప్పుడో గదర.”
“అబే, మీరిద్దరూ మూస్కొండి బే! దిగిపడిండ్రు ఆకాశం నుండి. నిద్దర్లేస్తే
మీరు ఓన్లీ అట్లాంటి సినిమాలే చూస్తర్ర? మసాలా సినిమాలు చూడరార? మీకేందో
దూల. శాన డీప్, శాన తోప్ అనిపించకోనికి. సూడూ, ఇవన్నీ చెప్పుకోడానికి బానే
ఉంటయి గాని మనందరికీ కావల్సింది ఎంటర్‌టైన్మెంట్! మనోరంజన్! ఏదైనా
దాన్తర్వాతనే.”
సమాధానం లేదు మాదగ్గర. వాడికున్న క్లారిటీ కూడా లేదు మాదగ్గర. రాత్రి
రూమ్‌కి తిరిగెళ్ళాం. మళ్ళీ హై అయ్యాం. ఈ నగరానికి ఏమైంది సినిమా చూశాం.
నవ్వీ నవ్వీ పడుకున్నాం.
పొద్దునంతా దిల్ చాహ్‌తా హై ఫోర్ట్ దగ్గర తిరిగి, సాయంత్రం అయిదింటికి
బాగా బీచ్ దగ్గర బార్‌లో కూర్చున్నాం. ఫోర్ట్ దగ్గర ఎటు చూసినా హనీమూన్
జంటలే.
“ఈ మినీస్కర్ట్ ప్లస్ చేతినిండా ఎర్రగాజుల కాంబినేషన్ నాకర్థమే కాదురాయ్య!”
“ట్రడిషనల్ వాల్యూస్ విత్ మాడ్రన్ ఔట్లుక్‌రా అది.”
ఆరుంపావుకి ఎవరికో ఫోన్ చేశాడు హర్ష.
“అరేయ్, ఎలెస్‌డీనా ఎక్స్‌టసీనా?
“ఏంది?”
“డీలర్‌గాన్తో మాట్లాడుతున్నా, ఏం కావాలె?”
“నేనేది కొట్టలే మీ ఇష్టం.”
“రేయ్, ఆసిడ్ చెప్పు.”
“హా భయ్య, హా ఎలెస్‌డీ. హా తీన్. ఛే బజె? ఠీక్ హై, థాంక్యూ.”
“ఇంకా గంటంటుండు. పదుండ్రి ఒక జాయింట్ కొట్టొద్దాం.”
తిరిగి టేబుల్ దగ్గరికొచ్చేసరికి పక్క టేబుల్‌లో ఒక కపుల్ కూర్చొనుంది.
“పిల్ల భలే ఉందిరా” అన్నా.
“ఏంది?”
“ఈ పక్కన పిల్ల బే, బ్యూటిఫుల్ ఉన్నది.”
మా వైపు తిరిగి చూసింది, నేను తల తిప్పేసుకున్నా.
“అరేయ్, అది ప్రాస్టిట్యూట్‌రా!”
“ఏంది?”
“ప్రాస్టిట్యూట్.”
“దొబ్బెయ్ ఫాల్తూగా. నోట్లోంచి ఒక్క మాట సక్కగ రాదురా?”
“అరే రోహిత్ చెప్పురా ఈడికి.”
రోహిత్ పక్కకి తిరిగి చూసి అన్నాడు, “అవున్రా.”
“అరే ఏం చిల్లరగాళ్ళుబే మీరు, పిల్ల మంచిగుందిరా అంటే ప్రాస్టిట్యూట్ అంటారు. ఎట్ల తెలుసురా మీకు?”
“ఎట్ల తెలుసుడేందిరా? వాడు చూడు ఎట్లున్నడో, అట్లాంటి పిల్ల పడ్తదారా
వాడికి. పింప్‌గాడు వాడు, ఇంకో రెండుసార్లు అటు దిక్కు చూశ్నవంటే వచ్చి
బేరం మాట్లాడతడు.”
ఈ కొత్త జ్ఞానంతో మళ్ళీ తన వంక చూశా. ఇరవై ఇరవైరెండేళ్ళ పిల్ల. మనసంతా
చేదుగా అయింది. ఆ బారు, మురికి టేబుల్స్, లౌడ్ మ్యూజిక్, స్టేల్ స్మెల్,
సెక్స్ కోసం, హై కోసం అక్కడున్నవాళ్ళమంతా పడుతున్న తపన, డెస్పరేషన్ గురించి
ఆలోచించి జుగుప్స పుట్టింది. దీన్నే శ్మశానవైరాగ్యం అంటారేమో.
ఏదో ఒక పాత సందులో పాత బిల్డింగ్. ఒకే ఒక స్ట్రీట్ లైట్. ఒక ఆక్టివా
పక్కనొచ్చి ఆగింది. ఓ బక్క మనిషి “చలో” అని బండి పోనిచ్చాడు. నేను బండి
స్టార్ట్ చేసి వాడి పక్కన చేరి అదే స్పీడ్‌లో నడిపిస్తున్నా. హర్ష కాష్
ఇచ్చాడు, వాడు దాన్ని తీసుకొని ఒకసారి చూసి జేబులో పెట్టుకొని చొక్కా
జేబులోంచి ఒక చిన్న కాగితం ముక్క ఇచ్చి రయ్యిమన్నాడు.
బార్‌లో హర్ష పొట్లం తీస్తే మూడు చిన్న కాగితం ముక్కలున్నాయి టిష్యూ పేపర్ అంత పల్చవి. తీసి నాలిక మీద పెట్టుకున్నాం.
అయిదు నిమిషాల తర్వాత అన్నా, “అరేయ్, నాకేం ఎక్కుతలేదు రా.”
“నీ అబ్బ ఇదట్ల కాదు. స్లో ఎక్కుతది, మస్త్ సేపుంటది ట్రిప్.”
అక్కడే చాలా సేపు టైంపాస్ చేశాం, నాకంతా మామూలుగానే ఉంది. “అరేయ్ వీడు మనల్ని హౌలగాళ్ళని చేసిండు, ఆ పేపర్ మీద ఏం లేదు.”
“ఇది గడ్డిలెక్క కాదు మామా. సటిల్ ఉంటుంది, జర రిలాక్స్‌గా, ఎంజాయ్ చెయ్.”
బార్ నెమ్మదిగ ఖాళీ అవ్వటం మొదలైంది. మా పక్కన కూర్చున్న పిల్ల మెట్ల దగ్గర తూలుతున్నట్టు కనిపించింది.
నేను చూడటం చూసిన రోహిత్ అన్నాడు. “నీసుమంటోడెవడో వెళతాడు ఆ పిల్లని
పట్టుకోడానికి. నవ్వి మీద చెయ్యేస్తది, రూమ్‌కి తీసుకెల్తది. పది నిమిషాల్ల
ఆ బ్రోకర్‌గాడు పోలీసుల్ని పట్టుకొచ్చి నీతాన ఒక యాభై వేలో లక్షో
దొబ్బుతడు.”
పొట్టలో తిప్పినట్టయింది. “అరె నాకెట్లనో అవుతోంది, పద రూమ్‌కి పోదాం.”
హర్ష నేను ఆక్టివా మీద, రోహిత్గాడు హర్షగాని థండర్‌బర్ద్ మీద బయల్దేరాం.
నా తల తిరుగుతోంది, బయట లైట్స్ చూస్తూంటే ఏదో కలైడోస్కోప్‌లోకి
చూస్తున్నట్టుంది. వెలుతురు మా మీద పడుతున్నట్టు కాకుండా మేమేదో
వెలుతురులాంటి ఒక చిక్కటి లిక్విడ్ లోంచి వెళుతున్నామనిపించింది. కింద
చూస్తే రోడ్డు దగ్గరికొచ్చినట్టయింది.
“రేయ్ సరిగ్గూర్సో. పోలీస్!”
మా ముందున్న రోహిత్‌ని వెళ్ళనిచ్చారు కానీ మమ్మల్ని ఆపారు. లైసెన్స్
చూపించి బ్రెత్ అనలైజర్‌లోకి ఊదాడు హర్ష. కాన్‌స్టేబుల్ జేబులు సర్దాడు.
ఫోను సిగరెట్ డబ్బా మాత్రమే ఉన్నాయన్నట్టు తీసి చూపించాడు హర్ష. నాకాబంది
ముందు రోహిత్ ఆగున్నాడు, మా పక్క నుండి మూడు నాలుగు బళ్ళు వెళితే ఒకదాన్ని
ఆపి ఇంకో కాన్‌స్టేబుల్ మాట్లాడుతున్నాడు. అంతలో సిగరెట్ డబ్బా లోంచి ఒక
చిన్న జాయింట్ తీశాడు పోలీస్.
“యే క్యా హై?”
“అరె కుచ్ నై హై సర్.”
“చలో, ఉత్రో” అని బండి తాళాలు తీసుకున్నాడు.
రోహిత్ బండి తిప్పుకొనొచ్చాడు. మాతో మాట్లాడుతున్న కాన్‌స్టేబుల్
ఇన్‌స్పెక్టర్ వైపు నడిస్తే వెంట హర్ష కూడా వెళ్ళాడు. కాళ్ళు సహకరించక నేను
పక్కన బండ రాయి పైన చతికిలపడ్డా. ఏదో సగం నిద్రలో మిడ్‍నైట్ షో సినిమా
చూస్తున్నట్టుంది. కాన్‌స్టేబుల్ మొహం మీద గడ్డం ఒక్కొక్క వెంట్రుక
విడివిడిగ కనిపిస్తోంది, అతని మొహం మీద గుంతలు, మెరుస్తున్న నుదురు. ఏదో
తనని మైక్రోస్కోప్‌లోంచి చూస్తున్నట్టు. అతనికో కుటుంబం, ఎనిమిది
తొమ్మిదేళ్ళ కూతురు, లోయర్-మిడిల్ క్లాస్ ఫామిలీ, ఒక బస్తీ లాంటి ప్రదేశంలో
రెండంతస్తుల వాటాలో కింద ఇంట్లో వీళ్ళుండడం, గులాబీ రంగు గోడలున్న ముందు
గదిలో పాత టి.వి. చూస్తున్న భార్య, పక్కనే హోమ్‌వర్క్ చేసుకుంటున్న కూతురు…
అతని మీద ఏదో తెలియని ఆప్యాయత కలిగి వెళ్ళి కౌగిలించుకోవాలనిపించింది.
లేవడం కష్టంగా ఉన్నా మెల్లిగా లేచి రోడ్డు ఇటు అటు చూసి దాటుదాం
అనుకుంటున్నప్పుడు హర్ష తిరిగొచ్చాడు.
“ఏడికొస్తున్నవ్? ఆగీడనే, పది వేలకి తెగింది బేరం. రోహిత్‌గాడు పోతుండు ఏటీయెం డబ్బులు తేనీకె.”
మళ్ళీ బండ దగ్గరికెళ్ళి నించొని సిగరెట్లు వెలిగించాం. రోహిత్ బండి మీద
ఇంకో కాన్‌స్టేబుల్‌ని ఎక్కించుకొని బయల్దేరాడు. “పదివేలేంది బే, హౌలగాడు
రోహిత్‌గాడు. పాతిక వేలడిగిండాడు, మూడు వేలకి తేలుస్తుండె నేను. అయినా
గోవాల గంజాయి బిగ్ డీలే కాదు. నీ అమ్మ అనవసరంగ” అనేదో అంటున్నాడు.
రెండుసార్లు నెమ్మదిగా కళ్ళు మూసి తెరిచా.
“అరేయ్, నాకిందాక ఆ కాన్‌స్టేబుల్‌ని పొయ్యి హగ్ చేసుకోవాలనిపించింది.”
గట్టిగా నవ్వాడు. “ఒడియమ్మ, అలగ్ ట్రిప్‌ల ఉన్నవ్రా నువ్వసలు!”
సిగరెట్లు అయిపోయాక అలానే కాసేపు నిలబడ్డాం. ఫోన్ తీసి చూస్తే టైమ్
పన్నెండుంపావు. అయిదు నిమిషాల్లో రోహిత్ తిరిగొచ్చాక బయల్దేరాం పక్క పక్కనే
బండ్లు పోనిస్తూ.
రూమ్‌లోకి వెళ్ళి చూస్తే కరెంట్ లేదు. అన్ని కిటికీలు తెరిచినా అసలు
గాలి లేకపోవడం వల్ల రూమ్ ఉడికిపోతోంది. అట్లానే పక్కల మీద చెమటలు కక్కుతూ
పడుకున్నాం. అలసిపోయాం కానీ నిద్దర ఎవరికీ రావట్లేదు, పెద్దేం
మాట్లాట్టానికీ లేదు. సాయంత్రం బీచ్ దగ్గర్ ఓ కుర్రాడి దగ్గర కొన్న ఎల్ఈడీ
లైట్‌తో హర్ష గోడల మీద ఆకారాలు మారుస్తూంటే చాలాసేపు చూస్తూ ఉండిపోయాం.
లేవడం లేవడం చాలా చిరాగ్గా లేచా. బ్రంచ్ చేస్తున్నంతసేపు నేనేం మాట్లాడలేదు.
“ఏమైంది బే?”
“ఏంలె.”
“ఏం లేక పోవుడేంది, గట్ల మొఖం పెట్కొని కూర్సొని.”
“ఛల్ నీ అమ్మ. ఏందిరా నిన్న రాత్రి ఆ పెంట?”
“ఏంది పోలీసోల్లాపిందా? నథింగ్ రా అది.”
“అరే ముడ్డికిందికి ముప్ఫై ఏళ్ళు దాటినై. ఐ ఆమ్ ఎ ఫకిన్ మారీడ్ మాన్.
ఇంకా ఏదో కాలేజ్‌లో ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నట్టు పోనీ సార్ అని
బతిమిలాడుడేందిబే అసహ్యంగ.”
“అంత ఓవర్-రియాక్ట్ ఎందుకు అవుతున్నవ్‌రా? ఏమైందిప్పుడు?”
“అరే ఈ ఫాల్తుగాడు ముడ్ల జాయింట్ పెట్టుకొని తిరగాల్నారా? యూ ఆర్ మిడిల్ ఏజ్డ్ మెన్ ఫర్ ఫక్ సేక్ నాట్ టీనేజర్స్!”
“ఓ పక్క లంగ పన్లు చేస్కుంటనే ఇంకోపక్క ఆడెవడో ఇజ్జత్ ఈయాలె, సలామ్
కొట్టాలె అంటే ఎట్ల నడుస్తది బే. నీయమ్మ, కొట్టినప్పుడేం ప్రాబ్లమ్ లేదు
కానీ దొర్కితే మాత్రం ఎక్కడ్లేని రోషం ఒస్తదీడికి.”
ఆ నిజానికి సమాధానమివ్వలేక ఇంకా కోపమొచ్చింది.
“పోదం పదండి, ఫ్లైట్‌కి టైం అవుతోంది” అంటూ లేచా.
రూమ్‌కెళ్ళి బట్టలు సర్దుకొని చెకౌట్ చేసి బయటికొచ్చే సమయానికి కాస్త కుదుటపడ్డ. “సారీ మామ్స్, ఓవర్-రియాక్ట్ అయినందుకు.”
“అంత ఆగం కాకురా అన్నింటికీ, చిల్. ఆఁ గలే మిలా.”
“అంతసేపు బండి నడిపితే బోర్ కొట్టదారా?”
“సద్గురు ప్రవచనాలు ఇన్కుంటొచ్చిన. ఇపుడ్ భీ గవె ఇన్కుంట పోత. క్రేజీ మాట్లాడ్తడు తాత.”
నేనూ రోహిత్ బండి తిరిగిచ్చి, డబ్బులు కట్టి, ఎయిర్‌పోర్ట్‌కి కాబ్
తీసుకున్నాం. “అరేయ్, మీ అమ్మని నవంబర్‌లో ఒప్పుకోమను. అపుడు డిసెంబర్‌లో
పెళ్ళికి నేనొస్తా.”
“మురళన్నా, ఎక్కడున్నరు?”
“నేనమీర్‌పేటలో ఉన్నానబ్బా.”
“అరె, నేను కాచిగుడ దగ్గరున్న. మీరు ఇంటిదగ్గరుంటే కలుద్దాం అనుకున్న.”
“ఆఁ కలుద్దాం, కానీ నాకిక్కడ ఇంకాస్త టైమ్ పడుతుంది. నువ్వు ఇక్కడికి రాగలుగుతావా?”
“ఓ పనిచేద్దాం. పంజాగుట్టకొచ్చేయన్నా. ఊర్వశిలో కూర్చుందాం.”
నేను వెళ్ళిన పది నిమిషాల్లో వచ్చాడు మురళన్న. కూర్చోగానే సంచిలోంచి
‘వీధి చివరి మలుపు’ తీసి ముందుంచా, “ఆటోగ్రాఫ్ ప్లీజ్” అంటూ. ఆయన నవ్వి,
“నీ కాపీ ఇంట్లో ఉందబ్బ” అంటూ ‘టు సూర్య – లవ్ మురళి’ అని రాసిచ్చాడు.
ఇంట్లోవాళ్ళ గురించి, ఇద్దరికీ స్నేహితులైన వారి గురించి, కోవిడ్ కష్టాల
గురించి, పుస్తకం పబ్లిషింగ్ ఇబ్బందులు, బుక్ రిలీజ్ ఫంక్షన్ కబుర్లు –
చెరి మూడు డ్రింక్స్ అయాక విశ్రాంతిగా వెనక్కు వాలాను, వెయిటర్‌కు సైగ
చేసి.
“దిల్ మస్త్ ఖుష్ ఉందన్న. మీ పుస్తకం కోసం ఎన్నేళ్ళనుండి
ఎదురుచూస్తున్నా. మొత్తానికి ఇప్పుడు తీరింది కల” అన్నాను పక్కనున్న
పుస్తకాన్ని ప్రేమగా నిమిరుతూ.
“అదేం లేదబ్బ, తెలుగులో కవితల పుస్తకం అంటే తెలిసిందే కదా. పట్టుమని
వందమంది కూడా కొనరు. అందుకే చాన్నాళ్ళు నేనే వద్దనుకున్నా, ఎక్కడో
అచ్చవుతున్నాయి కదా చాల్లే అని. కిందటేడాది కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత
అనిపించింది, ఒక పుస్తకముంటే బాగుణ్ణని.”
“హ్మ్, ట్రూ కానీ ఏమాటకామాటే. పుస్తకంలాగ ఉంటే ఆ కిక్కే వేరన్నా.”
అరక్షణం ఆగి గ్లాస్‌కేసి చూస్తూ అన్నా, “మీకో మాట చెప్పాలి, మీకు తెలుసు మీ
పుస్తకం అచ్చైందని నాకెంత హాపీగుందో. కానీ ఎక్కడో లోపల ఒక చిన్నపాటి జెలసీ
కూడ ఉంది. బట్, ఇది మీ పుస్తకం పార్టీ అండ్ అయామ్ సో ప్రివిలెజ్డ్ టు షేర్
దిస్ డ్రింక్ విత్ యూ. టు ది తెలుగు లార్కిన్” అన్నాను గ్లాస్ లేపుతూ.
మురళన్న కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు. డిస్టర్బ్ చేయడం
ఇష్టం లేక నేను కూడా సైలెంటుగా తాగుతూ కూర్చున్నా. ఉన్నట్టుండి తనతో తాను
మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు.
“నేను ఆకాశం నడిపే రోజుల్లో ఎన్నో కథలు చదివేవాణ్ణి. చాలామంది పిల్లలు
రాసి పంపేవారు. ప్రతీ పదింటిలో ఒక కథనో కవితనో ఎంపిక చేసేవాణ్ణి. అలా చదివి
వేసిన కథలే నీ మొదటి రెండు. అవి చదివినప్పుడు ఏదో పెద్ద రచయిత మొదటి
కథల్ని చదివినట్టనిపించింది. నాకే కాదు, వేరే ఇద్దరు ముగ్గురు స్నేహితులతో
మాట్లాడితే వాళ్ళూ అదే అన్నారు. నువ్వు అయిదేళ్ళల్లో కథాసంపుటి
తెస్తావనుకున్న. బట్ దెన్ ఐ డోంట్ నో వాట్ హాపెన్డ్. యూ లాస్ట్ యువర్ వే.
సినిమాల్లోనే ఉంటావనుకున్నా, అది వదిలేశావు. ఏదో కొన్నాళ్ళు జర్నలిజం అని
తిరిగావు, మధ్యలో బెంగుళూరులో ఏదో స్టార్ట్-అప్ అన్నావు, ఆ తర్వాత
అమెరికాకెళ్ళావు. కిందటేడాది ఫోన్ చేసి తిరిగొచ్చేస్తా తెలుగు ఆడియోబుక్
స్పేస్ బాగుంది, ఏమన్నా అక్కడ స్టార్ట్ చేద్దాం అన్నావు. వీటన్నింటి మధ్యలో
ఎంత మథనపడ్డావో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా నువ్వు రాయటం మానేశావు.”
నేను తలవంచుకున్నా. ఆయనన్న ప్రతీమాట గుండెల్లో చాకులా దిగింది.
“నేనొప్పుకుంటానన్నా. నేను రెగ్యులర్‌గా రాయలేదు, చదవలేదు. దాని
కారణాలేవైనా మీరు చెప్పింది నిజం, నేను రాయడం మానేశాను. కానీ నేను ముందు
రాసిన కథలూ కూర్చొని రాయాలి అని కష్టపడి రాసిందేం లేదు. అవి ఎలా వచ్చాయో,
ఎందుకొచ్చాయో తెలీదు కానీ వచ్చింది వచ్చినట్టు రాసి పంపాను. కానీ ఆ తర్వాత
ఎప్పుడూ అలా కాలేదు. రాయడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎదురయ్యేవి రెండే –
చెప్పడానికి నా దగ్గర ఏం లేకపోవటం, నేను ఇంకోళ్ళకి చెప్పేంత ఏముంది
అనిపించటం. మీతోనే ఎన్నోసార్లు ఈ రాయలేకపోవటం గురించి మాట్లాడా కదా. తెలుసు
నాకు వచ్చినా రాకపోయినా రోజూ రాయాలి, మన వాయిస్ వెతుక్కోవాలి, మనకి ఒక
యునీక్ వ్యూ ఉంటుంది అది పట్టుకోవాలి, వగైరా వగైరాలు. కానీ ఈ ఆలోచనలు నాకు
ఉపయోగపడలేదు. ఇంతో అంతో నేనూ ప్రయత్నించాను కానీ ఏం లేదు లోపల” అన్నాను ఆయన
కళ్ళల్లోకి చూస్తూ.
“అదేం లేదబ్బ. రైటర్ అని ఇంత పెద్ద మాన్‌స్టర్‌ని సృష్టించావు కాబట్టే ఈ
గొడవంతా. నిజానికి మామూలు జీవితాల మామూలు సంగతులే కథలు. కొందరు రాస్తారు,
కొందరు రాయరు- అంతే తేడా. ఎవరి కోసమో రాయకు, నీ కోసం రాసుకో, నువ్వు
చదువుకోడానికి రాసుకో. ఏ రచయితకైనా మొదటి ఆడియన్స్ వాడే కదా.
“ఇదీ ముందు చదివాను కానీ మీరు చెప్పిన విధానం బాగుంది. ఎప్పుడన్న కథ రాస్తే వాడుకుంటాను.”
ఆయన నవ్వుతూ పెగ్గు పూర్తి చేసి, “ఇక బయల్దేరదామా” అన్నారు. బిల్లు కట్టి పార్కింగ్ వైపు నడిచాం.
“థాంక్స్ అన్నా. ఫర్ ఎవ్రీథింగ్.”
“అవన్నీ వద్దులే. ఎక్కడన్నా దింపాలా?”
“లేదు, నేను వెళతాను. శారదక్కని, చిట్టిని అడిగినట్టు చెప్పండి.”
సాయంకాలం ఆఫీసులనుండి జనం తిరిగిరావటం మొదలుపెట్టినట్టున్నారు, మెట్రో
స్టేషన్ అంతా హడావిడి. ఏదో బరువు దించేసినట్టనిపించింది, మెదడులో హోరు
ఆగింది, పరిసరాల్ని చూస్తూ ఉండిపోయాను. ఈ అనుభూతి కొత్తదేం కాదు, కొంతసేపు
ప్రపంచం ఇలా అందంగా కనబడి ఒకట్రెండు రోజుల్లో తెలీకుండానే మళ్ళీ
చప్పబడిపోతుందని తెలుసు. ఈ జ్ఞానోదయాలు, ఎపీఫనీలు నెలలో మూడుసార్లవుతాయి.
అయినా ప్రతిసారీ ఇదే ఆఖరి సాక్షాత్కారం అనిపిస్తుంది, ప్రపంచం ఆ
రెండ్రోజులు తళతళ మెరుస్తుంది. మళ్ళీ కొన్నిరోజుల్లో అవే చిరాకులు, కోపాలు,
అసమర్థత, అర్థంకానితనం. తెలుసు నాకు ఈసారీ అంతేనని. కానీ ఎందుకో ఈ కొత్త
ఆనందాన్ని చప్పబర్చాలనిపించలేదు, కాసేపు అనుభవించాలనిపించింది.
రవీంద్రభారతి నుండి మలుపు తిప్పుకొని అసెంబ్లీ దాటుతూంటే వెనకాల
అస్తమిస్తున్న సూర్యుడు, ముందు అసెంబ్లీ పచ్చని ప్రాంగణంలో గాంధీతాత బొమ్మ
చూస్తే హైదరాబాద్ మీద పట్టలేనంత మమకారం ఉబికింది. ఇంటికెళ్ళి రాజన్న
రియాలిటీ చెక్ తిరగేయాలి, కానీ దానికి ముందు చేయాల్సిన పని ఇంకోటుంది.
మూసారాంబాగ్ స్టేషన్‌లో దిగి ఆస్మాన్‌గఢ్ వైపు నడిచా. ఒక కిరాణ కొట్టులో
ఆగి ఒక పెన్, నోట్‌బుక్ కొని నాలుగడుగుల దూరంలో ఉన్న కఫే లోకి తిరిగాను.
“కైసే హే బాసిక్ భాయ్, ఖైరియత్?”
“అరే కైసె హో! బహుత్ దినో కె బాద్!”
“హాఁ బహుత్ దిన్ హోగయే, ఆజ్ కల్ యహాన్ నహీన్ రెహ్రూ.”
“అయిసా. కైసె హైఁ తుమ్హారే సబ్ దోస్తా?”
“ఎక్దమ్ మస్త్. అరె బాసిక్ భాయ్, జర లెమన్ పిలావ్ నా.”
“హాఁ బైఠో భేజ్తూఁ.”
“షుక్రియా, ఏక్ మైల్డ్స్ భీ.”
లోపల కూర్చొని నోట్‌బుక్ తెరిచా. కుర్రాడు చాయ్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. “థాంక్స్ ఛోటూ.”
సిగరెట్ వెలిగించి ఈ కథ రాయడం మొదలుపెట్టాను.
--
Outtakes:
ఎయిర్‌పోర్ట్ బుక్‌షాపులో టైంపాస్ చేస్తూంటే ఎప్పడ్నుండో చదువుదామనుకుంటున్నగిలియన్ ఫ్లిన్ గాన్ గర్ల్ కనిపించింది. కొని ఫ్లైట్ ఎక్కి చదవటం మొదలుపెట్టా. ఆ పుస్తకంలో ఒక పాసేజ్ వల్ల ఒక కొత్త ప్రశ్న ఉద్భవించింది. ఇంత రాయాలి, రాయాలి అన్న తపన అసలెందుకుంది? నిజంగా ఏదన్న చెప్పదగింది బయటకి పొగింతే వేరు కానీ, కథలు రాయాలి, అందరూ చదివి గుర్తించి మెచ్చుకోవలి అన్న కాంక్ష దేనికి? ఒక కాపిటలిస్ట్ సొసైటీలో విలువ ప్రొడక్షన్ నుండో కన్సంప్షన్ నుండో నే వస్తుంది. దానిని మించి మనిషికి ఇంకో ఆలోచన ఉండకూడదన్న నియమం. ఎవరి జీతం ఎక్కువ, ఎవరి ఇల్లు పెద్దది, ఎవరికెన్ని కార్లున్నాయి- ఇలా అన్నీ తూకం వేసుకోవడమే. అలా ఉండకూడదని బయటికి చెబుతూనే నేనూ ఆ ఆలోచనల్లో చిక్కుకుపోయనా? డబ్బుతో వచ్చే కీర్తి కాక మేధస్సుతో వచ్చే కీర్తి కావాలి అని కోరుకున్నా, కాస్త లోతుగా ఆలోచిస్తే ఆ రెంటినీ వాంఛించే అహం, అజ్ఞానం ఒక్కటే కదా? మరి నేను దేనికని ఇన్ని బడాయిలు పోతున్నానో అర్థం కాలేదు.
అసలు కథ అంటే ఏమిటి? జీవితంలో జరిగే వేల నిమిషాల్లో కొన్నింటిని ఎన్నుకొని, దానిని ఒక రూపంలో ఇముడ్చి ఒక స్థలకాలంలో మనిషిగా బ్రతకటం అంటే ఏంటో క్లుప్తంగా చెప్పగలగటం. అసలు నరేటివ్ అంటేనే ఇంపొసిషన్. ఏం ఇంపోస్ చేయాలి అని నిర్ణయించేది రచయిత విజ్ఞత. కానీ నా గొడవంతా ఆ నిర్ణయం తీసుకోకుండా ఎలా తప్పించుకోవాలని. ఈ సగం అర్థం అయ్యి కాని థియరీలు అస్తమానం వల్లెవేయడం వెనక నిజం నా కమిట్మెంట్ ఫోబియా అనిపించింది. ఇది అని నిర్ణయం తీసుకుంటే మంచో చెడో అది అనుభవించాలి. కానీ నిర్ణయం తీసుకోవడం టలాయించినన్నాళ్ళు అన్ని పాసిబిలిటీస్ ఓపెన్ గానే ఉంటాయి. అందుకే జీవితమే నాకు కథలివ్వాలని కోరుకుంటున్నానిపించింది. అప్పుడు చెడైనా నేను బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు కదా. ఈ ఆలోచన నడుస్తూండగానే దాంట్లోని వెర్రితనమూ ఏకకాలికంగా బోధ పడింది.
--
పోనీ నేను ఆ వెయిటర్ కుర్రాణ్ణి కలిసి వాడి అంత:ప్రపంచాన్ని ప్రతిబింబిద్దామంటే అది అథెంటిక్ కాదు, నేను అప్రోప్రొయేట్ చేసినట్టవుతుందా? అదీ కాక వాడి రూపు రేఖలు, భాష ఆహార్యం బట్టి వచ్చేది కూడా సెకండ్-హాండ్ అసంప్షనే. మోహ్సిన్ హమీద్ అంటాడు, “I believe fiction has a strange power … that enables it to destabilize the collective imaginings we inherit and reproduce.” అంటే నేను సమాజం నుండి అరువు తెచ్చుకున్న ఇంప్రెషన్స్ కాకుండా వాడి జీవితంలోని నిజాన్ని పట్టుకోవాలి. వాడి ఉనికికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాడి umweltని తెలుసుకోవాలి. కానీ తెలుసుకోగలనా? అదీ తెలుసుకోవాలన్న నిజమైన జిజ్ఞాస తో కాక అది ఒక మంచి కథగ నాకు పేరు తేవాలన్న దురుద్దేశంతో మొదటి అడుగేస్తే అయ్యే అవకాశం ఏమాత్రమయినా ఉందా?
--
The point of writing, reading, the reason for almost everything we do is to be so involved in the moment that we transcend time. Pop-buddhism చెప్పినట్టు లీనమైపోవడం. And when writing happens naturally, ఇంత ఆలోచన వెంపర్లాట ఉండదు. You do it because it’s the most natural thing in the world to do. Woody Allen character ఒకచోట అంటుంది, "The point of life is to talk about living." If that's true, then the act of writing is an attempt to squeeze more and more life events into conscious experience.
"అరేయ్ నువ్వు సినెక్డకీనే చూసావు, నేను ఇన్స్టిట్యూట్‌లో దానికి బాబుల్లాంటి యురోపియన్ ఆర్ట్ ఫిల్మ్స్ చూసాను. నాలుగు, అయిదు గంటల సినిమాలు పదిహేను ఇరవై నిమిషాల స్టాటిక్ షాట్స్. ఒకటో రెండో నిజమైన అద్భుతాలు తప్ప మిగితావన్నీ మహాసోదే. చెప్పుకోటానికి చాలా థియరీలు ఉంటాయి కానీ సినిమాలో జీవం ఉండదు. అయినా సినిమా, ఏ కళ అయినా రియాలిటీని ట్రాన్స్క్రైబ్ చేయడానికే అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు. కళ దానికన్నా ఎంతో శక్తివంతమైనది. It gives you access to deeper truths. వెర్నర్ హర్జోగ్ అకౌంటెంట్స్ ట్రూత్‌ని, పోయెట్స్ ట్రూత్‌ని వేరు చేసి చెప్తారు ఒక చోట. వీలైతే అది చదువు"