పోయిన వారం అమ్మ '35 చిన్న కథ కాదు' చూసింది. తనకి చాలా నచ్చి నన్ను చూడమంటే మొన్న ఆదివారం చూసాను. నాకు సినిమా పెద్దగా నచ్చలేదు కానీ విశ్వదేవ్ రాచకొండ నటన, మొగుడు-పెళ్ళాల మధ్య గొడవయ్యే సీన్ రైటింగ్ చాలా నచ్చేశాయి. అయితే నీలి మెఘములలో పాట సంగీతపరంగా వినసొంపుగా, సాహిత్యపు భావం అందంగా ఉన్నా ఆ పాటని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో ఆఫ్ అనిపించింది. అమ్మంది సంస్కృత పద సమాస భూయిష్టం అయినందు వలన సరళంగా భావప్రకటన జరగట్లేదని. తను చెప్పింది అర్థం అవుతున్నా ("శబ్దం మీద సాధికారత ఉండటం అంటే పెద్ద పెద్ద మాటలు కంకరాళ్లలాగా విసరటం కాదు. అలాంటి వాళ్ల వచనం చదవలేం మనం. మాట డెన్సిటీ తెలిసుండాలి, తూచి వేయాలి."), నేను ఆ స్టైల్‌ని వెనకేసుకొచ్చాను. నా సమస్యల్లా, అండ్ ఇది నా మిడిమిడి జ్ఞానం కావొచ్చు, పండితులు చూసి బ్రహ్మాండంగా ఉంది అనొచ్చు- కనుక నిజవినయంతోనే, తెలుసుకోవాలన్న జిజ్ఞాసతోనే ఈ కింది ప్రశ్నలు అడుగుతున్నాను, నాకు ఆ పాటలో లాజికల్ ఇంకన్సిస్టెన్సీస్ కనబడుతున్నాయి. భావ ప్రకటన కాస్త మడ్‌ల్డ్‌గా తోచింది.
పాటని లైన్-బై-లైన్ పరిశీలిస్తే:
నీలిమేఘములలో ధరణీ తేజం - ధరణీ తేజం అంటే ధరణికి తేజానిచ్చేదా లేక ధరణి ఇచ్చే తేజమా? ఇంగ్లీషు light of the earthలో కూడా ఈ ద్వంద్వం ఉన్నా ఆ ఇడియంలో ఇంకాస్త ఈజీగా ఫిట్ అవుతుందని నాకనిపిస్తోంది.
నయనాంతరంగములలో వనధీ నాదం - నాదం అంటే ధ్వని, చెవులకు సంబంధించినది. మరి కళ్ళలో సముద్రపు శబ్దం ఏమిటి?
పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా
నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి వంచగలడా? - ఈ ఇమేజరీ భలే నచ్చింది నాకు. Although, technically, ఇక్కడ ముడుచుకున్న నుడివిల్లుని సరి చేయాలి కదా?!
సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా
వసుధా వాణి మిథిలా వేణి మదివెనుక పలుకు పలుకులెఱుగ గలడా? - ఇక్కడ సీతను మీథిలా నగరంలో పారే నదని ఉద్దేశిస్తున్నాడా?
నీలిమేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో వనధీ నాదం
జలధి జలముల్ని లాలించు మేఘమే
వాన చినుకు మార్గమును లిఖించదే
స్వయంవరం అనేది ఓ మాయే
స్వయాన కోరు వీలు లేదాయె
మనస్సులే ముడేయు వేళాయె
శివాస్త్ర ధారణేల కొలతాయే - ఈ చరణం నాకు ముందు అర్థం కాకపోయినా, ఈ కమెంట్ పుణ్యమా అని అర్థం అయ్యి నచ్చింది.
వరంధాముడే వాడే పరం ఏలు పసివాడే - పరంధాముడు? ఈ కాంటెక్స్ట్‌లో పసివాడెందుకయ్యాడు?
స్వరం లాగ మారాడే స్వయం లాలి పాడాడే
భాస్కరాభరణ కారుణీ గుణ శౌరి శ్రీకరుడు వాడే - భాస్కరుణ్ణి ఆభరణంగా తొడుక్కోగలిగేంత ప్రజ్వలిస్తున్న వాడనా? ఆ కామెంట్ రాసినాయన సూర్యవంశోద్ధారకుడు అని అనువదించారు.
అవనిసూన అనుశోకాన స్థిమితాన తానుండ లేడే
శరాఘాతమైనా గాని తొణికేవాడు కాడే
సిరి సేవించి సరి లాలించి కుశలములు నిలుప ఘనము నొదిలి కదిలే తేలె - తన ఠీవిని పక్కన పెట్టి సీతను బుజ్జగించడానికి కదిలాడు.
మేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో వనధీ నాదం...!!
మళ్ళీ చెబుతున్నా- పాటలో తప్పులు ఉన్నాయా/ఉన్నాయి అని లేవదీయడం నా ఉద్దేశం కానే కాదు, అంత పాండిత్యమూ లేదు. నాకు అర్థం కాని విషయాలు అర్థం చేసుకోవలనే ఈ ప్రయత్నం. తెలిసీతెలియని తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించగలరని మనవి చేస్తూ..
బుజ్జిమామ భాషలో చెప్పాలంటే,
భవదీయుడను.