Tuesday, September 6, 2022

किस किस को बताएंगे

మా అమ్మమ్మ ని ప్రేమించినట్టు నేనెవ్వర్నీ ప్రేమించలేదు. ప్రేమించలేనేమో. అమ్మ పట్ల అపారమైన ప్రేముంది, ఆప్యాయతుంది, గౌరవముంది, కృతజ్ఞతుంది. కానీ అమ్మమ్మ పట్ల హక్కుంది. తనని ఏదైనా అడగొచ్చు. అమ్మమ్మ ఇది కావాలి అంటే ఒక్కరోజనలేదు కుదరదు, చేతకావట్లేదు, ఇంకెప్పుడైనా అని. అది ఏ విషయమినా, ఎలాంటి పరిస్థితిలోనైనా అడిగిందిచ్చింది. అడగొద్దు అన్న స్పృహ కూడా పెద్ద లేదు. అరే తను ఇంకో మనిషి, తనకీ ఓపిక, మనస్సు తీరు, ఇష్టాయిష్టాలు ఉంటాయన్న ఆలోచనే లేదు. తనున్నది నాకొసమే, మరి నా అమ్మమ్మ ని నేనడుగుట్ల సంకోచమేంది భై. ప్రతి రాత్రి నిద్రపోయేముందు కళ్ళ ముందు మెదుల్తది. తనని ముట్టుకోగల్గితే ఎంత బాగుణ్ణు అనిపిస్తది. గట్టిగ ముద్దుపెట్టుకో గల్గితే ఎంత బాగుణ్ణు అనిపిస్తది. స్వర్గమనేదుంటే తన కాళ్ళ దగ్గర కూర్చొని ముద్దలు తినడమే.

నేను చావు గురించి గట్టిగనే ఆలోచిస్తా. నా చావు గురించి. వృద్ధాప్యం, రోగం, బాధ, శారీరిక హింస ఇదంతా సరె. చావు గురించి; అంటే ఓరోజు నేనుంట మరుసటి రోజుండ. అప్పుడు గుండెల దడ మొదలైతది. అదేదో నేను పొయ్నంక ఏమైతదని కాదు. నాలోని సైన్స్ పాఠకుడు చెప్తడు, అరే నువ్వే పొయినంక తర్వాత ఏమైతది అని చూడనీకె ఎవ్వడు మిగలడని. అది నేను నమ్ముత. భయమెందుకంటే ఈ ముప్ఫై ఏళ్ళల్ల నేను కొన్ని జ్ఞాపకాలు సంపాదించిన. కొన్ని దృష్యాలున్నై నా మనస్సులో. అవి నాకు ప్రియం, నాకే అపురూపం, నాకే అమూల్యం. నేను పొయ్నంక అవన్నీ మాయమైపోతాయని బాధ.

హనుమాన్ నగర్ ఇంటి మిద్దె మీద అమ్మమ్మ ముద్దలు తినిపిస్తూంటే అప్పుడే తాత స్కూల్ నుండి తిరిగొచ్చింది. సెవెన్త్ క్లాస్ ఆన్వల్ డే అయిపోయిన తర్వాత స్కూల్ నుండి చీకట్లో నేనూ అమ్మ బస్ స్టాప్ కి నడవడం. మా నాన్న తో వెళ్ళి కలోనియల్ కసిన్స్ కాసెట్ కొనుక్కోవడం. నాకు కాడుపులో అకస్మాత్తుగా నొప్పి వస్తే అమ్మమ్మ పరిగెత్తుకుంటూ దామొదర్ రెడ్డీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళిన సందర్భం. చలికాలపు రాత్రుళ్ళు పది కాగానే తాత శాలువ సరిచేసుకుంటూ గేటుకి తాళం వేయడానికి వెళ్ళడం. జొహూర్ భాయ్ తో తాత ముందు కూర్చుంటే కారు వెనక సీట్లో నేను అమ్మమ్మ వొళ్ళో పడుకొని జమ్మికుంట నుండి తిరిగొచ్చిన సాయంత్రం. ఇలా ఇంకొన్నున్నాయి. అవన్నీ శూన్యంలో కలిసిపోతాయన్న బెంగ.

నా అమ్మమ్మ, నా తాత. ఎన్నడన్న వీళ్ళ గురించి ఒక కథ రాయలన్న కోరిక. కానీ అలా రాయలేకుండా పోతే ఇవన్నా మిగులుతాయని, అంతే.

No comments: