Monday, May 12, 2014

ప్రపంచాన్ని మమేకం చేసిన ఏకాంతం

My tribute to Gabriel Garcia Marquez.

--

ప్రపంచాన్ని మమేకం చేసిన ఏకాంతం

Posted on మే 7, 2014 by శిరీష్ ఆదిత్య


“ఎన్నో సంవత్సరాల తరువాత, తుపాకులతో ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూస్తున్నప్పుడు, కల్నల్ ఒరులియానొ బ్యుందియాకు తన తండ్రి తనకి మొదటిసారి మంచుగడ్డ చూపించడానికి తీసుకువెళ్ళిన ఆ మధ్యాహ్నం గుర్తొచ్చింది.”


ఈ వాక్యం సాహితీ చరిత్రలోనే అన్నిటి కన్నా ప్రఖ్యాతి గాంచిన వాక్యం అంటే అతిశయోక్తి కాదు. ఇలా మొదలవుతుంది గేబ్రియల్ గార్సియ మార్కేజ్ రాసిన “One Hundred Years of Solitude” నవల.


అక్టోబరు 6, 2008 – నాకింకా తేది గుర్తుంది. సాయంత్రం సుమారు ఏడు గంటలు కావొస్తోంది. నాంపల్లి స్టేషన్ ఎదురుగా ఉన్న సెకెండ్హేండు బుక్ షాపులో నేను పుస్తకాలు చూస్తున్నాను. గూళ్ళలో ఉన్న పుస్తకాల టైటిల్స్ చూస్తూ, తెలిసిన రచయిత పేరు కనబడితే ఆగి పుస్తకం వెనుక అట్ట మీది సారాంశాన్ని చదువుతూ అలా ఒక పసుప్పచ్చని స్పైన్ ఉన్న పుస్తకం ముందు ఆగాను. గేబ్రియల్ గార్సియ మార్కేజ్ పేరు ఎక్కడో విన్నట్టే ఉంది కాని పెద్దగా ఏ విషయమూ తెలీదు. సినొప్సిస్ నచ్చి, పాబ్లొ నెరూద సిఫార్సు ఉండడంతో కొని ఇంటికి తెచ్చాను. ఆరాత్రి పదింటికి చదవడం మొదలెడితే, పొద్దున పుస్తకం అయిపొయేదాక ఒక ట్రాన్స్ స్టేట్ లో ఉండిపొయాను. మకొండొ అనబడే ఒక కల్పిత ఊరిలోని, ఏడు తరాల బ్యుందెయ్ కుటుంబీకుల కథ అది. యదార్థానికీ, కల్పనకీ, మాయకీ, ప్రాపంచికమైన దానికి మధ్య అభేదంగా సాగిపోతుందీ రచన. అప్పుడు నా వయసు చిన్నదైనా, నాకు గొప్ప సాహిత్యం పైన పెద్ద అవగాహన లేకపోయినా, ఎందుకో ఆరోజు అనిపించింది – నేను జీవితంలో ఎన్ని గొప్ప పుస్తకాలు చదివినా, ఎన్నో రచనల వల్ల మంత్రముగ్ధుడిని అయినా ఈ అనుభూతి ముందు ఏది ఆనదని. ఒక పుస్తకం ఎమేమి చేయగలుగుతుందో, అది ఈ పుస్తకం చేసిందని. ఆ రోజు సాహిత్యపు గొప్పతనం బోధపడింది. మనిషి మేధాశక్తి మీద గర్వం కలిగింది. గార్సియ మర్క్వెజ్ నా ముందు ఉండుంటె ఆయనకి పాదాభివందనం చేసేవాడిని.


అసలు ఈ పుస్తకం ఇంత ప్రఖ్యాతిగాంచడానికి కారణలేంటి? “మాజిక్ రియలిజం” అనబడే సాహిత్య ప్రక్రియని ప్రపంచానికి పరిచయం యెలా చేసింది? ఏ గొప్ప పుస్తకమైనా అది రాయబడిన సమాజపు పరిధిలో పేరు గడిస్తుంది కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాలవాళ్ళు ఈ పుస్తకాన్ని ఎందుకు ఇంతగా అభిమానిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు నా దగ్గర లేవు. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు. ఎన్నో శతాబ్దాల తరవాత, Ray Bradbury రాసిన “Fahrenheit 451” లాగ ప్రపంచం తయారైనా, ఈ పుస్తకం చదివేవాళ్ళు ఇంకా ఉంటారు. ఈ పుస్తకం గురించి ఇంత చెపుతున్నాను కానీ, అసలు ఈ పుస్తకం దేని గురించో నేను చెప్పడంలేదు ఎందుకంటే summarise చేయడానికి ఇది మామూలు కథ కాదు. ఇది ఒక ప్రయాణం. గాబొ (అభిమానులు ఆయన్ని అలా పిలుస్తారు) సృష్టించిన ప్రపంచంలోకి మనం అడుగుపెట్టినప్పటి నుండి respite లేకుండా తిరుగుతాం. మకొండొలో ఒక మనిషిగా జనంలో కలిసిపొతాం, బ్యుందియా పరివారాన్ని, వారి వారసుల జీవితాలనీ దగ్గరుండి పరిశీలిస్తాం. ప్రపంచం గుండ్రంగా ఉందన్న అద్భుత సత్యం తెలిసిన రోజున అర్కెడియొతో పాటు ఆశ్చర్యచకితులమౌతాం, ఒరులియనొతో కలిసి మంచుగడ్డని చూసిన క్షణాన సంబరపడతాం. ఎంతో అందగత్తె అయిన రెమెడియోస్ బట్టలారేస్తూ నెమ్మదిగా ఆకాశానికి ఎగిరిపోవడం కన్నార్పకుండ చూస్తాం, ఆఖరకు బాబిలొనియతో కలిసి తన కుటుంబం గురించి రాసిన తాళపత్రాలు చదువుతూ, ఆ చిట్టచివరి వాఖ్యానికి నివ్వెరపోతాం.


మాజిక్ రియలిజం స్పానిష్ భాషలో కొత్తదేమి కాదు. కాని అది గాబొలాంటి మాంత్రికుడి చేతిలో ఒక కొత్త ఉనికికి పునాది వేసింది. ఆయన రచనల్లో వాస్తవానికీ-ఊహకీ తేడా తెలియదు, కాలం linearగా కాక cyclicalగా సాగుతుంది. ప్రత్యేకించి One Hundred Years of Solitude లో “చరిత్ర పునరావృతం అవుతుంది” అన్న నానుడి నిజమైనట్టు తోస్తుంది. జరిగిన సంఘటనలే కొంచెం మార్పుతో మళ్ళీ జరుగుతూంటాయి, ఒకేలాంటి ప్రవృత్తులు కలిగిన మనుష్యులే మళ్ళీ, మళ్ళీ పుడుతూంటారు. గాబొ ఇతర రచనల్లో కూడా ఎక్కువగా మళ్ళీ మళ్ళీ తారసపడే రెండు నేపథ్యాలలో – ఒకటి, ప్రూస్ట్ రచనల్లో మాదిరిగా జ్ఞాపకాలే అప్పుడప్పుడూ ప్రస్తుతానికన్నా యదార్థంగా అనిపించే గుణం (Imaginary worlds replacing Reality); రెండవది, ప్రతి మనిషి, కుటుంబం, దేశం వాటి వాటి పరిధుల్లో ఏకాంతంలో ఉండడం (The loneliness within). ఇక పాత్రల విషయానికొస్తే, దాదాపు ప్రతీ పుస్తకంలో ఏదో ఒక పాత్ర అయినా నెరవేరని ప్రేమ కోసం తపిస్తుంది (Unrequited Love – ఈ నేపథ్యం ప్రధానంగా ఆయన Love in the Time of Cholera రాసారు).


ఇలా ఒక కుటుంబాన్ని నేపథ్యంగా తీసుకుని, గాబొ మానవజాతి కథను గ్రహించే ప్రయత్నం చేసాడు. ఆయన చేతుల్లో మకొండొ సృష్టికి ఒక microcosm గా పని చేసింది. 1967లో మొదటిసారి స్పానిష్ లో అచ్చయ్యి, అత్యంత జనారాధన పొందిన ఈ పుస్తకం, గ్రెగొరి రబాస్స చేసిన అత్యధ్బుతమైన అనువాద రూపంలో ఆంగ్ల సాహితీ ప్రపంచంలో ఒక ప్రభంజనం సృష్టించింది. “ప్రపంచంలొ ప్రతి మనిషి తప్పక చదవాల్సిన పుస్తకం”, అని కళా విమర్శకుడు విలియం కెనెడి అన్నారు. కేవలం గార్సియ మార్కేజే కాక, ఆ సమయంలో ఎన్నో గొప్ప రచనలు చేస్తున్న ఇతర లాటిన్ అమెరికన్ రచయితల పుస్తకాలు కూడ ప్రపంచఖ్యాతిని పొందాయి. (దీనినే Latin American Boom అంటారు).


20వ శతాబ్దపు ప్రపంచ సాహిత్యంలో అతి గొప్ప రచనగా One Hundred Years of Solitude ని చాలా మంది మేధావులు పరిగణిస్తారు. కాని అదే కాకుండ ఆయన ఇంకెన్నో గొప్ప రచనలు చేసారు. Love in the Time of Cholera, Autumn of the Patriarch, Chronicle of a Death Foretold, The General in his Labyrinth ఆయన రచనల్లో ప్రసిద్ధమైనవి. కథా రచయితగానే కాక విలేకరిగా, స్క్రీన్ రైటర్ గా కూడ ఆయన చాలా మంచిపేరు సంపాదించుకున్నారు. కాని “One Hundred Years of Solitude” ఆయనకు యెనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది; 1982 నోబెల్ సాహిత్య బహుమతి కూడా రావడానికి కారణమైంది.


మాజిక్ రియలిజం అనబడే ఒక సాహిత్య ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ పుస్తకమే అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. యుక్త వయసులో కాఫ్కా, దాస్తోయెవ్‌స్కీ, విలియం ఫాక్నర్ రచనలు చదివిన ప్రభావం గాబొ మీద చాలా పడింది. “కాఫ్కా ‘మెటమార్ఫసిస్’ చదివే దాక నాకు తెలీలేదు అలా రాయొచ్చని” అని ఆయనే చెప్పారు. అలాగే, ఫాక్నర్ రచనల్లో ఉండే Yoknapatawpha County అనే కల్పిత ప్రాంతపు ఛాయలు కూడా గాబో సృష్టించిన మకొండొ పైన పడ్డాయి. చిన్నతనం అంతా అమ్మమ్మ-తాతల దగ్గర, ఒక చిన్న ఊళ్ళో పెరిగిన గాబొ తన దేశం గురించి, చుట్టూ ఉన్న సమాజం గురించి ఎన్నో కథలను తన తాత దగ్గర విని నేర్చుకున్నాడు, అంతకన్నా ముఖ్యంగా, ఎంతో అద్భుతమైన విషయాలను కూడ మామూలు స్వరంతో, ఎటువంటి అతిశయోక్తి లేకుండ చెప్పడం అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాడు. తను రాసేది కల్పితమని ఎందరు అన్నా, తను రాసే ప్రతి విషయం యదార్థంతో ముడిపడి ఉంటుందని, లాటిన్ అమెరికన్ జీవన శైలే అలాంటిదని ఆయన ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఆయన రచనలు చదివితే ఎంత మజా వస్తుందో, ఆయన స్వీయచరిత్ర Living to tell the tale చదివినప్పుడు కూడ అంత మజాగా ఉంటుంది. గొప్ప జీవితంలోంచే గొప్ప సాహిత్యం పుడుతుందన్నమాట నిజమనిపిస్తుంది.


గార్సియ మార్కేజ్ ఇక లేరు అని తెలిసిన రోజున, నేను నా దగ్గరున్న ఆయన పుస్తకాలు తీసి అక్కడక్కడా చదవసాగాను. మనిషి పోయాడన్న బాధ ఎక్కడో ఉంది కానీ ఇంత గొప్ప సాహితీ సంపదను వదిలి వెళ్ళినందుకు కృతజ్ఞత ఇంకా ఉంది. సాలింజర్ పోయినప్పుడు మెహెర్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి – “ఇప్పుడు జె.డి. సాలింజర్ అనే రచయిత మరణించాడు. ఇన్నాళ్ళూ నాతో సన్నిహితంగా మాట్లాడిన ఓ గొంతు తాలూకూ మనిషి ఇప్పుడు లేడు. కానీ ఆ గొంతు మాత్రం నాతోనే వుంది, వుంటుంది”. ఎందుకు ఒక రచయిత పుస్తకం చదివి ఆయన మీద అంత ప్రేమ, మమకారం పెంచుకుంటాం? ఎందుకని ఒక కథకుడు సృష్టించిన ప్రపంచంలోకి మాటిమాటికీ పరకాయ ప్రవేశం చేస్తాం? అసలు మనం పుస్తకాలు ఎందుకు చదువుతాం?


నాకు తెలిసినంత వరకు, మనం పుస్తకాలు చదివేది మన constricted being నుండి బయటకు వచ్చి, ఇంకో మనిషిలా ఇంకో జీవితం బతికితే ఎలా ఉంటుందో తెలుసుకోడానికి. నేనే ఆ పాత్ర ఉన్న పరిస్థితిలో ఉంటే, ఎలా స్పందిస్తాను అని నా గురించి నేను కనుక్కోటానికి. ప్రతి గొప్ప పుస్తకం ఇది చేస్తుంది. కాని కేవలం చాల కొన్ని పుస్తకాలు మాత్రమే ఈ పరిధిని కూడా దాటి మనల్ని transport చేస్తాయి, engross చేస్తాయి, envelop చేస్తాయి. One Hundred Years of Solitude అలాంటి ఒక పుస్తకం. అది చదివాక ఆ పాత్రల జీవితాలన్నీ నేనే జీవించిన అనుభూతి కలిగింది, catharsis పొందినట్టు అనిపించింది. పుస్తకం ముగించేసరికి పునర్జన్మ ఎత్తిన భావం కలిగింది. చదివిన ప్రతిసారీ కలుగుతుంది.


For that and everything else, Gracias Gabito.

2 comments:

Deekshith said...

While this piece presents a miniature biographic depiction of Marquez, what I observed underlyingly is you write wonderful Telugu.

On the whole, a spectacular portrayal of a writer who just passed away physically but the one whom you chose to stay close to you heart. Touching. Moist.

Unknown said...

When we experience something good or read a great book, the joy is multiplied when we share it. You have wonderfully depicted what you felt after reading the solitude exactly what a review should do. I had already read it, otherwise, I would have done so after reading your review.