Thursday, January 2, 2025

action its manifestation

ఇప్పుడే అమ్మని ఎయిర్పోర్ట్ లో దింపి ట్రైన్ ఎక్కాను. కిందటి సారి అమ్మ వెళ్ళిపోయాక ఇంటికొచ్చి తను పడుకున్న మంచాన్ని చూసి, ఆ ఖాళీని భరించలేక ఏడ్చేసాను. ఈసారి మనసు తేలిగ్గా ఉంది. గత కొన్ని వారలు హడావిడి ఉన్నందు వలన తనతో కూర్చొని గడిపే సమయం ఎక్కువ దొరకలేదు ఇన్నాళ్లు. కానీ నిన్న సాయంత్రం పార్కులో నడుస్తూ చాలా సేపు మాట్లాడాము, ఈరోజు పొద్దున్న ట్రైన్ లో వెళుతున్నప్పుడు మళ్ళీ. అందుకే ఆ వెలితి లేదేమో. "I suppose in the end, the whole of life becomes an act of letting go, but what always hurts the most is not taking a moment to say goodbye", అని రాస్తాడు యాన్ మార్టెల్. నిజమే, మంచి గుడ్బై ఎంత ఉపశమనం.

నిన్న డాయిల్ గ్రౌండ్ లో కాసేపు 'ఆత్మస్తుతి పరనింద' కానిచ్చిన తరువాత ఆ గోధూళి వేళలో తాను వెళ్ళిపోతోందన్న షేర్డ్ మూడ్ లో ఉన్నందుకోనేమో మేము ఈ ఎలజీస్ గురించే మాట్లాడుకున్నాము. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, మనమూ వెళ్ళిపోతాము అన్న స్పృహ గురించి, మనం వెళ్ళిపోయాక కూడా ప్రపంచం దాని పాటికది నడుస్తూనే ఉంటుందన్న చివుక్కుమనిపించే ఆలోచన గురించి. వేరేవాళ్లు తమ గురించి చెప్పిన సోదే మళ్ళీ మళ్ళీ చెబుతూంటారు అని మేము వాళ్లకి వంకలు పెడుతూనే, శ్రావణి నాతో అన్నట్టు మేమూ ఈ, ఇలాంటి విషయాల గురించే పదే పదే సంభాషిస్తూంటాం. అందులో ఒక ఎలీటిస్ట్ అహంకారం లేక పోలేదు; కానీ అది మా ఇద్దరి కామెనాలిటీ కూడా, మాకు నిజంగానే ఇంపార్టెంట్ విషయం.

చాలా ఏళ్ళు మేము మాత్రమే ఉండటం వల్లనో మరి నాకు అమ్మకి కలిసి మాట్లాడుకోడానికి చాలా సమయం దొరికింది. అవి చాలా ఫ్రీ, ఫ్రీవీలింగ్ కాన్వర్సేషన్స్. నా పరిణితికి, సంభాషణ-క్రాఫ్ట్ కి, ఆలోచనలను వ్యక్తపర్చగలిగే నేర్పుకి ఆ సమయాలు చాలా దోహదం చేసాయని నా నమ్మకం. మా ఇద్దరి అనుబంధంలో తల్లి-కొడుకుల సాధారణ బాధ్యతల-బరువుల కాంపొనెంట్ ఉన్నా, చాలా విషయాలు చెప్పుకోగలిగే స్నేహం ఇలానే ఏర్పడిందని నాకు అనిపిస్తుంది. “She discovered with great delight that one does not love one's children just because they are one's children but because of the friendship formed while raising them”, అన్న మార్క్వెజ్ వాక్యం నా వరకు రివర్స్ లో అనుభవ సత్యం.

కిందటి సారి తనొచ్చినప్పుడు మేము చాలా పోట్లాడుకున్నాము. తనకి చాదస్తం చాలా పెరిగిందని , తన కొత్త పరిచయాలతో చాలా ప్రభావితమై మారిపోయిందని, నా మీద నేను భరించలేనంత ఎమోషనల్ బర్డెన్ వేస్తోంది అని నేను చీటికీమాటికీ విసుక్కునే వాడిని. తాను నా గురించి అలానే అనుకుందో ఏమో మరి కానీ మాకు ఓపెన్ సంభాషణలు కాలేదు, ఒకళ్ళ ఎజెండా ఇంకోళ్ళ మీదికి దోపే ప్రయత్నమే జరిగింది - నా వైపు నుండి మరీ ఎక్కువగా. కానీ ఈ సారి ఇంకా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, నేను "my daughter my rules" అని అందరితో పోట్లాటలు పెట్టుకున్నప్పటికీ బానే ఉన్నాం. మనం ఒకటి కాటానికి ఇంకోళ్ళ ప్రెసెన్స్ దోహదం పడుతుంది కదా.

"Constantly talking isn't necessarily communicating", అని రాస్తాడు చార్లీ కాఫ్మన్. ఇన్ఫాక్ట్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండడం కమ్యూనికేషన్ కి డెట్రిమెంటల్ అనిపిస్తోంది. You can miss the wood for the trees. చాలా చాలా సంవత్సరాలు నేను ఒక విషయంతో మధన పడ్డాను. అరె నేను ఇన్ని లక్షల క్షణాలు బ్రతికితే దాంట్లో ఈడ్చితంతే ఒక వందో వెయ్యో గుర్తుండటం ఎంత అన్యాయం, ఎంత వేస్టేజ్, ఎంత లాస్ట్ టైం అనుకునే వాడిని. వాటినీ ఎలానో పట్టుకుంటే నా జీవితం ఇంకా నిండుగా, ఇంటెన్స్ గా ఉన్నట్టు కదా అని. జీవితం అంత సింపుల్, లినియర్ ఈక్వేషన్ లో ఇమడదని ఇప్పుడు తెలుస్తోంది. దైనందిన జీవితం వేరు, దాన్ని మనం నెమరు వేసుకునే విధానం వేరు, మన ఆలోచనలకు ప్లాన్స్ లో అది తీసుకునే రూపం వేరు, మన కలల్లో కళల్లో ఇమిడే ద్రవ్యం వేరు. అన్నిట్లో ఓవర్లాప్ ఖచ్చితంగా ఉంది, కానీ ఏదీ ఇంకోదానితో రీప్లేసబుల్ కాదు.

నేను ధరణితో నా అనుభవాల నుండి ఏర్పరుస్తున్న మాటల కట్టడాల స్ఫూర్తితో ధీరజ్ గాడు ఒక కవిత రాసానని చెప్పాడు. అలా చెప్పడం వాడి ఉదారత, స్ఫూర్తి గీర్తి జాన్తానై రాసినోడిదే కవిత అన్నాన్నేను. అదెలా ఉన్నా కవిత చాలా బాగుంది, ఒక బిట్ చాలా చాలా నచ్చేసింది.

కణాలైతే కనుమరుగవుతాయి
సిరా లక్షణం తడి కదా
ఈ గుండె ఆడినన్ని రోజులు
రక్తమై తిరుగాడుతుం[ది]

ఆ ఆలోచనే ఈ ఇన్సైట్ కి కీ అయింది. మాటల్లో జీవితాన్ని అనుభవించే ఫార్మ్ లోనే స్టోర్ చేయలేము. కానీ ఈ క్రూడ్ ఫార్మ్ లో తర్జుమా చేయడం మహాప్రధానం - ఇంటలెక్చువల్ అండ్ ఎమోషనల్ సస్టైనబిలిటీకి. మ్యాప్ ఎప్పటికి టెరిటోరి కాలేదు. ఒకవేళ అయితే అది ఇంక పనికి రాదు. జీవితానికీ మన మెంటల్ కాన్స్ట్రక్ట్స్ కీ, ప్రపంచానికీ మన సోషల్ కాన్స్ట్రక్ట్స్ కీ అలాంటి సంబంధమే.

కాస్త జూమ్ అవుట్ అయ్యి చూస్తే అమ్మతో స్థిమితంగా, ప్రత్యక్షంగా ఇంక గడపగలిగేవి, అదృష్టం బాగుంటే, కొన్ని వందల గంటలు. ఆ స్పృహతో మెలిగి, ఇంకొన్ని విలువైన సంభాషణలు కూడగట్టుగో గలిగితే, కలిసి ఒక నాలుగు ప్రయాణాలు చేయగలిగితే అంతకు మించిన వరం లేదు. 

--టైటిల్ కె. శివారెడ్డి గారి పక్కకి ఒత్తిగిలితే epigraph లోంచి.

03/Jan/2024

Addendum: 

10-12 ఏళ్ల కింద చెన్నైలో ఒక శనివార మధ్యాహ్నం వాళ్ళ హాస్టల్ రూములో రాజనాల గాడికి బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ చూపించాను. వాడు అది తెమలగా తెమలగా, డిస్ట్రాక్ట్ అవుతూ వేరే ముచ్చట పెడుతూ ఎలానో అలా పాపం సినిమా మొత్తం చూసి, "ఏంది రా ఈ సోది" అనడిగాడు. అప్పుడు వాడికి ఆ సమయంలో నేను వేలాడే థియరీల మీద శాఖాచంక్రమణం చేస్తూ ఇలా ఆ సినిమాని వెనకేసుకొచ్చుంటాను- "జీవితం అంటే ఇలానే ఉంటుంది కదరా.. పెద్ద ఏమీ జరగదు. ఒక పావుగంట కూర్చొని గమనిస్తే అర్థం అవుతుంది 15 నిముషాలు అంటే ఎంత ఎక్కువ సమయమొనని. అదే చూపాంచాలి అని..". అప్పుడు వాడన్నాడు, "అదే జీవితాన్ని చూడాలంటే నేను పోయి నా బ్రతుకు నేను బ్రతుకుతా గానీ ఈ సోదేందుకు చూస్తా బే".

వాడన్నదాంట్లో తత్త్వం ఇప్పుడిప్పుడే కాస్త బోధ పడుతోంది.

1 comment:

SHYAMALA RANI said...

తప్పకుండా ప్రయత్నం చేద్దాము. మరపురాని ఇంకొన్ని మధుర జ్ఞాపకాలు మూట గట్టుకుందాము…🤗