Monday, January 30, 2023

..కలగలిపి సముద్రమంటారు

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః

చాలా ఏళ్ళ కింద ఫేస్బుక్‌లో స్వర్ణకమలం సినిమా మీద నేనొక పోస్ట్ చదివాను. మీనాక్షి సినిమా అంతా నా మానాన నన్నొదిలెయ్యి మొర్రో అంటున్నా చంద్రం మాత్రం తన వెంటపడుతూ, తను ఎలా బ్రతకాలో ఏం చేయాలో చెప్తూనే ఉంటాడు. చెప్పడమే కాదు తన ప్రమేయం లేకుండా తన జీవితంలో చొరబడి మరీ తన చుట్టూ ఉన్నవాళ్ళని ప్రభావితం చేస్తూ ఆ అమ్మయి మీద కొన్ని చర్యలు impose చేస్తాడు. అలా మీనాక్షి individual rights ని, ఇష్టాయిష్టాలని బేఖాతరు చేసిన వాడిని మనం హీరో అంటున్నాము, ఆ అమ్మాయి చివర్లో పరివర్తన చెందితే అది చూసి చెప్పట్లు కొడుతున్నాం. ఇదెక్కడి న్యాయం? అన్నది ఆ పోస్ట్ సారాంశం. అది చదివి కరెక్టే కదా ఇతను చెబుతున్నది అనిపించింది. చాలా ఏళ్ళ తరవాత మళ్ళీ ఆ ప్రశ్నని ఎదురుకొనేంత ధైర్యము, intellectual tools సమకూరాయి అనుకుంటూ..

మన modern, liberal sensibility నుండి చూస్తే ఆ ఆలోచన నూటికి నూరుపాళ్ళూ సమంజసమే. ఆ అమ్మాయి తన మానాన తనుంటే ఆ అబ్బాయి అలా కాదు, నీలో ఉన్నది నువ్వు గుర్తించలేక పోతున్నావు అని వెంబడిస్తూనే ఉంటాడు. Infact, కాస్త provacativeగా చెప్పాలంటే మనం ఇప్పుడు ఏకిపారేసే ఇడియట్, అర్జున్ రెడ్డీ లాంటి సినిమాలు ఎంత anti-feminist ఓ, ఎంత హీరోయిన్లకు ఏజెన్సీ లేకుండా చేస్తారో ఇదీ అంతే. (ఇక్కడొక counter-factual: ఒకవేళ విశ్వనాథ్‌ గారు పాత్రలు switch చేసి హీరోయిన్ హీరో వెంబడి పడేట్టు చేసుంటే అప్పుడు కూడా మన reception ఇలానే ఉండెదా? లేక ప్రకృతిని పురుషుడు అదుపు చేయాలి అన్న remnant thought మనలో ఉండి మనం చంద్రంలోని righteousnessని సులువుగా అర్థంచేసుకుంటున్నామా?). కానీ దీంట్లో హీరో హీరోయిన్‌తో నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి అనడు. నీలో అపారమైన విద్వత్తుంది, అది బయటకి తీసుకొచ్చే బాధ్యతుంది అంటాడు.  

అయినా కూడా ఆ విద్వత్తుతో ఏం చేసుకుంటుందో ఆమె విజ్ఞానానికి, more importantly, ఆమె ఇష్టానికి సంబంధించిన విషయం. ఒకటో రెండో సార్లు చెప్పే హక్కు కుటుంబసభ్యులకో, స్నేహితులకో ఉంది కానీ, ముక్కు మొహం తెలియని పరాయివాడికి ఏమాత్రం హక్కు లేదు అన్నది వాదన. "నాకు ఈ కూచిపూళ్ళు, భరతనాట్యాల మీద అస్సలు మక్కువ లేదు. వాటి నుండి నాకు దమ్మిడీ ఆదాయం లేదు, ఎందుకూ పనికిరాని చెప్పట్లు, బిరుదులు తప్ప. దానికన్నా ఒక హోటల్లో concierge లా ఉద్యోగం చేస్తే నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు, మంచి బట్టలు కట్టుకొని ముస్తాబవచ్చు, అన్నింటినీ మించి సెలెబ్రిటీస్‌ని దెగ్గరి నుండి చూడొచ్చు. అదే నా ఇష్టం, నా కోరిక." (ఈ పాత్ర సాగర సంగమంలోని బాలకృష్ణకి సరిగ్గా 180°). ఇది చాలా ఆసక్తికరమైన dramatic setup.

ఎమియ శ్రీనివాసన్ అనే తత్వవేత్త The right to sex అనే పుస్తకంలో కోరికలు (desires) గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటారు: అవును, liberal society లో ప్రతి వ్యక్తికీ తనకి నచ్చినట్టు బ్రతికే హక్కు ఉంటుంది. అది inalienable right. ఆ హక్కు ఇంకొక మనిషి హక్కులకి అంతరం కలిగించనంతటి వరకు ఎవరైన వాళ్ళకి నచ్చినచ్చు ఉండొచ్చు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చినట్టు గడపొచ్చు, వాళ్ళ కోరికలని తీర్చుకోవచ్చు. కానీ మనం అంతటితో ఆగిపోకూడదు. మనం అడగాల్సిన మరి ప్రశ్న: ఆ మనిషికి ఆ కొరిక ఎలా పుట్టింది, ఒక పని చేయాలన్న, ఒకలా ఉండాలన్న, ఒక వస్తువు కావలన్న వాంఛ ఎక్కడినుండి వస్తుంది? అది కూడ తెలుసుకోవాలి.

ఇదే ప్రశ్న మనం మీనక్షిని, "ఏమ్మా నీకెందుకు హోటల్లో concierge గా చేయలనుంది" అనడిగితే ఆమె బహుషా తను చూసి ప్రభావితం అవుతున్న సినిమాలనో, టీవీనో, బయట షోకుగా తిరిగే శ్రీమంతుల వల్లనో అని చెబుతుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. తనకి డబ్బు సంపాదించి దరిద్రం తప్ప ఇంకేమివన్ని కళల నుండి బయట పడాలి అన్న కోరిక ఎంతుందో, గ్లామరస్‌గా బ్రతకాలి అన్న కోరికా అంతే ఉంది. ఈ ఫీలింగ్స్‌కి diagnosis ఎంతో మంది Marxist thinkers ఇచ్చారు. అందులో ఒకరయిన మార్క్ ఫిషర్ Capitalist Realism అనే పుస్తకంలో ఈ టాపిక్‌ని గాఢంగా పరిశీలిస్తూ Consumerist societies లో desires ని manufacture చేసి images ద్వారా disseminate చేస్తారు అంటారు. అంటే తిండి-గుడ్డ-గూడు-basic మానవ సంబంధాలు కుదిరిన మనుషులు, నెక్స్ట్ ఏంటి? అనే టైంకి అడ్వర్టైస్మెంట్లు ఇది నీకు నెక్స్ట్ కావాల్సింది, ఇది నీ కోరిక, దీనికోసం నువ్వు పరితపించాలి అని వాడి మెదడులో గూడు కట్టుకుంటాయి. అలాంటి కొత్త కోరికలు పుట్టించక పోతే Capitalist Economy చట్రం తిరగడం ఆగిపోతుంది అని వాళ్ళ వాదన.

ఇప్పుడు తను ఎంతగానో పరితపించి పోతున్న concierge ఉద్యోగం దూరం కొండల తీరు; దాంట్లోనూ కష్టాలు లేకపోలేవు అన్న జ్ఞానోదయం మీనాక్షికి ఇప్పుడు కాకపోయినా ఇంకొన్నేళ్ళల్లో తెలుస్తుంది. దాన్నే మనం mid-life crisis అంటాము. అది సహజం. అది తెలియపర్చటానికి చంద్రం అక్కర్లేదు. కానీ ఆ అమ్మయికి ప్రస్తుతం అర్థమయ్యే పరిభాష అదే. అందుకే ఘల్లుఘల్లు పాటలో తన సంతోషం గురించే మాట్లాడతాడు- ఈ చవకైన ఆకర్షణలకు లొంగిపోకు దీనికి ఎన్నో రెట్లు ఆనందం పొందగలిగే మాధ్యమం నీలో ఉంది, దానివైపు దృష్టి పెట్టు అని వాదిస్తాడు. కానీ తన నిజ సంకల్పాన్ని శివపూజకు చిగురించిన పాటలో వెల్లడిస్తాడు. నీ self-fulfillment equation లో సగభాగమే. ఇంకో సగం నువ్వు నిర్వర్తించాల్సిన ధర్మం.  చంద్రం పరితపించేదల్లా ఆ అమ్మయిలో ఉన్న అపారమైన నాట్యసంపత్తి సమాజానికి, దేశానికి అందకుండా పోతుందని. Which raises the more interesting question- What do we owe the world?

ప్రతి సమాజంలో పౌరురాలికి హక్కులెలా ఉంటాయో, బాధ్యతలూ అలానే ఉంటాయి. Traditional Indian thought లో దాన్ని ధర్మం అంటాము. రామాయణం వినేప్పుడు నాకు చాలా ఏళ్ళు ఒక విషయం అర్థం కాలేదు. రాముడు సులువుగా పరిష్కారించ గలిగిన సమస్యలను కూడా ఎందుకు ధర్మం పేరుతో కష్టతరమైన మార్గాన్ని ఎన్నుకున్నాడని. ప్రతి మనిషికీ తన శక్తిని బట్టి, తన అవసరాల బట్టి తనకి నచ్చినట్టుంటూ, కష్టాన్ని తగ్గించుకొని సుఖాన్ని పెంచుకోవాలన్న కోరిక, హక్కు, స్వేఛ్ఛ ఉంటాయన్నది మన core assumption. కానీ దానికన్నా ఇంకో higher ideal కి aspire అయ్యేవాళ్ళ చర్యలు మనకి rational అనిపించవు. ఇది ఎక్కడో పురాణాల్లోని విషయమే కాదు, మన చుట్టూనే ఎంతో మంది ఉంటారు: భారతదేశ సంరక్షణ అన్న abstract concept కోసం యుద్ధంలో పాల్గొనే సైనికుడు, కోవిడ్ వార్డ్లో పనిచేస్తే జబ్బు చేస్తుందని తెలిసినా తన బాధ్యతని నిర్వర్తించే డాక్టారు, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రభుత్వానికి వ్యతిరెకమైన ఒక న్యూస్‌ని బయటపెట్టే జర్నలిస్ట్- వీళ్ళందరూ వాళ్ళ ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళే. అంతెందుకు, మన సినిమాల్లో ప్రతీ హీరో చుట్టుపక్కన వాళ్ళ ఆలోచనలని, సూచనలని పక్కన పెట్టి వాడికి కరెక్ట్ అనిపినంచిదే చేస్తాడు. అందుకే వాడు హీరో. ఈ సినిమాలో ఒక తేడా ఏంటంటే ఆలోచన-చర్య అనే రెండు dimensions ఉండేది ఒక మనిషికి కాదు, అవి రెండు పాత్రల్లో చీల్చబడ్డాయి.

మీనాక్షి ప్రపంచానికి ఏం ఋణపడుందని చంద్రం వాదన? Especially, ప్రపంచం తనకి ఏమివ్వలేదని మీనాక్షి అస్తమానం సణుగుతున్నప్పుడు. ఆ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నమే చంద్రం చేస్తూ వస్తాడు. ప్రపంచం/ జీవితం నీకు కావాల్సింది ఇవ్వలేదేమో, కానీ అది ఇచ్చిన ప్రత్యేకమైన బహుమానాన్ని నువ్వు గుర్తించటం లేదు అంటాడు. నీకు కావలసిన దాని పట్ల నీకు వాంఛే కాదు, నీ దగ్గర ఉన్నదాని పట్ల నీకు భక్తి, కృతజ్ఞత ఉండాలి అన్న అభిప్రాయం అతనిది. తను material మాత్రమే చూడగలుగుతోంది, అతను ఆమెకు spiritual చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పద్దెనిమిదేళ్ళు దాటాయి కాబట్టి నా హక్కులు నావీ అన్నది ఆమె సిద్ధాంతం, వయసుతో నిమిత్తం లేదు ఆధ్యాత్మిక పరంగా తను ఇంకా చిన్న పిల్లేనని అతని అభిప్రాయం. ఆ రెండు worldviews మధ్య సంభాషణే సిరివెన్నెల గారి పాటలు కూడా. ప్రేక్షకులుగా మనకి ఆ అమ్మాయి అసహనం, స్వేఛ్ఛాకాంక్ష ఎలా అర్థం అవుతాయో, మీనాక్షికి తన నటవిశ్వరూప సాక్షాత్కారం కలిగించాలనే చంద్రం ఉన్నతమైన అభిలాష మీద కూడా అభిమానం ఏర్పడుతుంది. ఎవరు ఎక్కువ correct?  

And there lies the brilliance of the film. ఇది ఇన్నేళ్ళుగా relevant గా ఉండటానికి కారణం. ఒక good old hero's journey format లో విశ్వనాథ్‌ గారు రెండు competing worldviews యొక్క clash ని ఇమడ్చారు. సినిమా చివర్లో ఒక judgement call చేస్తుంది కానీ దానితో మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. (ఇంకో counter-factual: ఒకవేళ భానుప్రియ ధనవంతుల కుటుంబంలో పుట్టుండి, ఇంతే ప్రతిభ ఉండి కూడా నాట్యం చేయటానికి నిరాకరించుంటే? అప్పుడూ చంద్రానికి తన కుటుంబం అంత చనువిచ్చుండేదా?) 

మీనాక్షిలో జన్మతహ (పూర్వ జన్మ సుకృతం అనేవాళ్ళూ ఉండకపోరు) అపారమైన ప్రతిభ ఉంది. తన అక్కకి క్రమశిక్షణ, కళ పట్ల భక్తి, పరిపక్వత ఉన్నా తనకి నాట్యం అబ్బలేదు, సంగీతమే. కానీ తనకి తన ధర్మాన్ని గుర్తించి దానికి తగ్గట్టు బ్రతకాలన్న జ్ఞానం (acceptance అంటారు కొందరు) ఉంది. ఒక చోట, ఒకలా పుట్టినందుకు ఒక పని చేయాలి అన్న నియమాన్ని caste అంటామని, అభినవ సమాజంలో దానికి చోటు లేదని నేనే వాదించాను. కనీ ఇది caste కాదు; అదే అయితే అక్క కూడా నర్తకే అయ్యుండాలి. ఇది purely individual.

అవును మనమందరం individuals ఏ, మన వ్యక్తిగత స్వేఛ్ఛ చాలా ముఖ్యం. కానీ self అనేది ఒక concrete, static entity కాదు; అది porous, dynamic, reflexive. ఇంకో కోణం నుండి చూస్తే మీనాక్షి purely emotional id అయితే, చంద్రం సాక్షాత్కరించిన superego. రెండూ మనలోని కోణాలే. మన కోరికలకీ బాధ్యతలకీ, ఇష్టాలకీ కష్టాలకీ, easy కి right కి మధ్య అనుబంధం అంత తేలిగ్గా తేలదు. ఆ జుగల్బందీయే మానవ తత్వమేమో? 

No comments: