Thursday, December 8, 2016

సాయంకాలమైంది గురించి కొన్ని మాటల్లో

తెలుగులో చాలా గొప్ప సాహిత్యం ఉందని విన్నాను. వాటిల్లో చాలా తక్కువ వాటి గురించి తెలుసు. ఆ తెలిసిన చిన్న జాబితాలో కూడా కొన్నే చదివాను- చలం మైదానం, శ్రీశ్రీ మహాప్రస్థానం, శ్రీ రమణ మిధునం. ఇప్పుడు ఆ జాబితాలో గొల్లపూడి మారుతీరావు గారి సాయంకాలమైంది ని జోడిస్తున్నాను. ఈ పుస్తకానికి సాహితీ విమర్శ చేసేంత స్థాయి నాకు లేదు; అయినా ఈ గొప్ప రచన గురించి కొందరికైనా చెప్పాలన్న తాపత్రయం ఉంది. అందుకేనేమో పుస్తకం చదువుతున్నప్పుడు కూడా ఉన్న అనేక extraordinary snippets లో కొన్నిటికి ఎంత చలించిపోయానంటే చాలా మందికి ఆ screenshots పంపాను. చదువు నీకు చాలా నచ్చుతుంది అని అమ్మ అన్నప్పుడు దాని ప్రభావం నా మీద ఇంత ఉంటుందని నేను ఊహించలేదు. థాంక్యూ మా.

కథ దేని గురించి- శ్రీ వైష్ణవ సాంప్రదాయం లో పరమ నిష్ఠా గరిశ్ఠులైన ఒక పురోహితుల కుటుంబం నేపధ్యం. అందులో సుభద్రాచార్యులు అనే ఒక మహానుభవుడు. ఆయన తన తరంలో చూసిన మార్పులు- అలవాట్లల్లో, సాంప్రదాయాల్ని పాటించే తీరులో, సమాజంలో, కుటుంబీకుల మధ్య బాంధవ్యాలలో. దీని చుట్టూ ఒక అద్భుతమైన కథని అల్లారు గొల్లపూడి గారు. సుభద్రాచార్యుల గారి జీవితాన్ని పీఠం గా చేసుకొని చాలా విషయాల మీద సాంఘిక వ్యాఖ్యానం చేసారు. హిందూ తత్వజ్ఞానం గురించి చర్చించారు, అమెరికా వలసల కి అద్దం పట్టారు, తల్లితండ్రుల-పిల్లల అనుబంధాల fabricని దగ్గర నుండి చూపారు, సాయం గురించి మాట్లాడారు, గొప్పవాడెప్పుడూ మంచివాడవ్వాల్సిన అవసరం లేదని చెప్పకుండానే తెలియజేసారు. అంతమైపోతున్న సాంప్రదాయ ఆచారాల నిర్వహణ కళ్ళకట్టినటు చూపించారు.

వీటన్నింటి గురించి ప్రస్తావించటం ఒక ఎత్తు- ఇది ఆయన మేధా సంపత్తికి తార్కాణం. కానీ ఆ విషయాలన్నీ ఇంత మంచి కథలో ఇంత అందంగా అల్లటం చాలా మంది తరం కాదు. గొల్లపూడి వారి వచనం కైంకర్యాం చేసిన వేడి వేడి చక్కెరపొంగలి లాంటిది- రుచి అమోఘం, తన్మయత్వం నిశ్చితం. ఎన్నో పాత్రలు, ప్రతీ పాత్రకీ ఒక అనన్యత. రెండే వ్యాఖ్యాల్లో పాత్రని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ప్రతి మనిషీ వాడి వాడి మనస్తత్వాన్ని బట్టి, కర్మ ఫలాల బట్టి జీవితం నడిపిస్తాడు. అది నిజం, అదే నిజం- మంచి చెడులు నిర్ణయించటానికి మనమెవరం. ఆయన రచనలో judgement ఉండదు, sympathy ఉంటుంది- అదొక benign realism.

మారుతీరావు గారి మీద నాకున్న ఒకే ఒక చిన్న అభియోగం ఆయన అకస్మాత్ authorial intervention. కథ మధ్యలో ఆయన వృత్తాంతాన్ని తెంపుతూ ఒక పేరా మన ప్రస్తుత జీవనశైలి మీద చిన్న aside లాగా రాస్తారు. ఈ కథ ముందు సీరియల్ గా ప్రచురింపబడినందుకేమో అప్పట్లో ఇది అంత కొట్టొచినట్టు కనబడుండదు కానీ పుస్తక రూపంలో సరిగ్గా ఇమడలేదు. అయినా ఏదో పితూరి చెప్పాలని చెప్తున్నాను కానీ ఇది పున్నమి చంద్రుడిలో మచ్చలు చూపటం లాంటిది. అది మనలోని లోపాలకు అభివ్యక్తం మాత్రమే.

ఈ పుస్తకం గురించి నేను చెప్పేదంతా superficial. కుండలో చంద్రుడి ప్రతింబింబం చూపినట్టు. నాలాంటి న్యూస్పేపర్ చదివే అత్తెసరి గాడికే అర్థం అయ్యిందంటే ఎవరైనా చదవచ్చు. మీరే చదవండి- మీలో వొచ్చే మార్పు కి మీరే సాక్ష్యం.

1 comment:

dheeraj kashyap said...

Nenu chadavali aithe. .
ruchi amogham, thanmayathvam nischayam!
fida nenu ah line ki!