Monday, October 12, 2015

సోల్ మెట్

I wrote this story last October. For Kinige Smart Story Competition. Word limit of 750 words. I spent more than a month wiling away, searching for ideal topics. On the day of the deadline, I went to watch Karthikeya because Bujji mama wanted me to watch and let him know how the film was. I parked my bike outside the theatre to save ten bucks and left my helmet with the bike. And then, this happened. 

--

ఈరోజు నా హెల్మెట్ పోయింది. సినిమా థియెటర్ బయట పార్క్ చేస్తే ఎవరో కొట్టేసారు. నేను చీకట్లో నవ్వుతూ, బాధపడుతూ, భయపడుతూ సినిమాలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఎవరో బయట దాన్ని దొంగలించారు. నా హెల్మెట్ - గీతలు పడ్డ వైజర్ తో, వెనక ఊడిపోతున్న స్టిక్కర్లతో, అన్ని వైపులా ఉన్న గాట్లతో, నాతో ఎల్లవేళలా ఉన్న హెల్మెట్ ఈరోజు పోయింది. గత మూడేళ్ళుగా నన్ను రక్షిస్తూనో, నాకు అపాయింటుమెంటు ఇచ్చిన వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు నా బాగ్ కి వేళాడుతూనో, లేక నేను తనని బైక్ కి తగిలించి గంటలు గంటలు మరిచిపోతే నాకోసం ఓపిగ్గా యెదురు చూస్తూనో ఉండేది. నేను బండి మీద వెళుతున్నప్పుడు పాటలు పాడుతున్నా, లేక పగటి కలలు కంటూ ఎన్నో గంటలు నాతో నేనే మాట్లాడుతున్నా విసుక్కోకుండా వినేది. నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం యెదురు చూస్తూ తన మీద డ్రమ్స్ వాయిస్తే నవ్వేది, అర్జెంటు పని ఉండి రోడ్డు మీద విపరీతమైన ట్రాఫిక్ లో ఇరుక్కు పోయి ఏం చేయాలో తెలియక, ఆ కోపాన్ని తన మీద చూపిస్తూ తనని కొడితే మౌనంగా భరించేది. 

తను నా నిరంతర సహచరిగా ఉండి, నా కోపాలనీ, సంతోషాలనీ నాతో పాటు అనుభవిస్తూ, నన్ను తన protective veil నుండి జీవితాన్ని చూడనిచ్చింది. అర్థ రాత్రులలో హఠాత్తుగా వచ్చే భయంకరమయిన లారీ హార్న్ లను వింటే నేను బెదురుతానని, వాటిని నా వరకు రానివ్వకుండా తాను ఇంకించుకునేది. నేను తనచే కల్పించబడిన సురక్షితమయిన స్థానం లో రంగు రంగుల కలలు కంటున్నప్పుడు, తను ఎండలో, వానలో తడుస్తూ నన్ను కాపాడేది. మేమిద్దరం కలిసి పాటలు వింటూ, తలాడిస్తూ ప్రయాణిస్తునప్పుడు నా earphones పోలీసులకు కనబడ కుండా దాచేసేది. మేము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, వెరైటి మనుషులని చూసి జోకులేసుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటే వాళ్ళు చూడకుండా నా చూపులనీ, నవ్వులనూ దాచేసేది. ఈ  విషయాలన్నీ నాకప్పుడు తెలీవు, తను నాకెప్పుడూ తెలియనివ్వలేదు. తను లేక ఇప్పుడు ఇంటికొస్తూంటే తెలిసొచ్చాయి. అన్నిటి కన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని రోజుల్లో తనని ఒక్కసారి కూడా నేను ఆప్యాయంగా నిమిరి, ఎలా ఉన్నావు అని అడగలేదు; ప్రేమగా పలకరించలేదు.

గమ్మత్తయిన సంగతి ఏంటంటే ఇప్పుడు నేను తన స్పర్శని ఫీల్ అవ్వగలుగుతున్నాను. నా చెంపల మీద తన గట్టిబడి పోతున్న ఫోం, నా మెడ దెగ్గర ఊగిసలాడుతున్న తన స్ట్రాప్, నా ఊపిరి నిండా తన వాసన పరిమళిస్తోంది. ఇప్పుడు నేను చేయి జాపితే, తన వీపుమీదున్న సగం ఊడిన Studds స్టికర్ ని తాకగలుగుతాను. ఇప్పుడు తను నా కళ్ళెదురుగానే ఉంది, ఒంటి నిండా దెబ్బలతో మచ్చలతో, ఆ సగం విరిగిన వైజర్ ఎడమ స్క్రూతో. తన లాగ ఎన్నో వేల హెల్మెట్లు తయారై ఉండుంటాయి, ఒకప్పుడు అచ్చం తనలాంటివే. వాటన్నింటిలో నుండి తను నా జత అయ్యింది- యాదృచ్ఛికమేనా? మా ఈ మూడేళ్ళ కాపురంలో, మేము కలిసి గడిపిన యెన్నో వేల ఘడియల్లో తను నా సొంతమైంది. ఎన్నో సార్లు తను సర్దుకుపోతూ నన్ను perfect గా accomodate చేసింది. అప్పుడప్పుడూ అనిపించేది, తను నా ఆలోచనలను చదవగలిగేదేమోనని, నా అవసరాలను నాకన్నా ముందే పసిగట్టేదేమోనని. నేను వైజర్ పైకెత్తి బండి నడుపుతున్నప్పుడు, హఠాత్తుగా దుమ్మూ పొగ వస్తే, నేను వైజర్ దించుదాము అనుకునే లోపు, అప్పటి దాకా firm గా clamp అయ్యి ఉన్న వైజర్ ఠక్కున కిందికి జారేది.

తను ఎప్పుడూ నాతోనే ఉంది, ఎప్పుడూ తోడు వీడలేదు. కానీ ఈరోజు నేను నా నిర్లక్ష్యం వలన తనని పోగొట్టుకున్నాను. తను నా కోసం ఎదురు చూస్తునప్పుడు, నేను తన గురించి మరిచిపోయాను. నేను తనని థియెటర్ లోనికి తీసుకు వెళ్ళి ఉండవచ్చు కానీ తనొక భారం అనుకున్నాను. నేను తనని బండికి లాక్ చేసి ఉండవచ్చు కానీ తనని ఎవరు తీసుకెళతారులే అనుకున్నాను. పాతపడిన, నిండా గాట్లున్న హెల్మెట్టే కదా, ఎవడు పట్టుకుపోతాడులే అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. నా నిర్లక్ష్యం మా ఇద్దరినీ ఇంత బాధ పెడుతుంది అని నేను ఊహించలేదు. ఎవడో తనని బండి నుండి తీస్తునప్పుడు, తీసుకొని నడుస్తూ వెళ్ళిపోతునప్పుడు, తను నా కోసం పిలిచినప్పుడు నేను తన దగ్గరకు పరుగుతీయలేదు. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, సినిమా చూస్తునప్పుడు, సెకండ్ హాఫ్ లో గుండె చివుక్కుమంది, నన్ను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. 

తను ఈరోజు దూరమవుతుందని ముందే తెలిసున్నాబాగుండేదేమో. తనకి బై చెప్పే అవకాశం కూడా దొరకలేదు- థాంక్యూ చెప్పుండే వాడిని, తనంటే నాకెంత ఇష్టమో చెప్పుండే వాడిని, తను నా జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజేసే వాడిని. తను ఇప్పుడెక్కడున్నా నా గురించే ఆలోచిస్తూంటుంది, కొత్త వాళ్ళ నడుమ భయపడుతూంటుంది, నా రాక కోసం ఎదురు చూస్తూంటుంది. నాకు తెలుసు. 
నా ఈ ఆరాటం తనని చేరితే బాగుండు. ఎందుకంటే తనకి ఈ మాటలని విని అర్థం చేసుకొని, స్పందించే హృదయముంది. అదేంటో, ఇన్ని రోజులూ తనని ఏ పేరుతోనూ పిలవలేదు. ఆ అవసరం రాలేదు. మా ఇద్దరి సమక్షంలో నేను మాట్లాడిన మాటలన్నీ తనకేనని మా ఇద్దరికీ తెలుసుననేమో. 


నాకెంత బాధగా ఉందంటే తను రోజూ ఉండే స్టూల్ వంక కూడా చూడలేక పోతున్నాను. హెల్మెట్ పోయిందని ఏడుస్తున్నాను అంటే జనాలు నవ్వుతారని ఏడుపాపుకుంటున్నాను. అయినా పిచ్చి జనం, వాళ్ళకేం తెలుసు మా అనుబంధం. నువ్వు తొందర్లోనే దొరకాలని దేవుడికి మొక్కుకుంటాను. అప్పటి దాక, నన్ను గుర్తుంచుకుంటావు కదా సోల్ మెట్?

1 comment:

Anonymous said...

Hi, Sirish, I found your post about Trivikram Srinivas, recently, and was impressed by your analysis and diction. I'd like to take your help with writing an article about him. If you're interested, please contact me ASAP at indira_parimi@yahoo.com.
Thanks and regards,
Indira