Sunday, April 27, 2014

అస్తిత్వం

The first Telugu story I ever wrote and my first publication in a magazine of reputation. The fact that I wrote a story in Telugu, which Amma liked, which so many people connected to still seems unbelievable after all these weeks.

--

అస్తిత్వం
Posted on ఏప్రిల్ 3, 2014 by శిరిష్ ఆదిత్య

నేను నాస్తికుణ్ణి. నిజం చెప్పాలంటే ఊహతెలిసాక దేవుణ్ణి రెండుసార్లు గాఢంగా వేడుకున్నా. మొదటిసారేమో డిగ్రీలో ఫస్ట్ క్లాసు మార్కులొస్తే శ్రీశైలం వస్తానన్నాను. రెండో సారి ప్రేమించిన అమ్మాయి తిరిగి ప్రేమిస్తే తిరుమల కొండెక్కుతానన్నాను. దేవుడు రెండుసార్లు చేయిచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని దేవుడే సద్వినియోగం చేసుకోవట్లేదని వదిలేసాను. ఆ తరువాత అంత అవసరం మళ్ళీ ఎప్పుడూ రాలేదు.


నేను ఢిల్లీకి వచ్చి ఏడాది దాటింది. హిందీ కాస్తో, కూస్తో మెరుగుపడింది కానీ రొట్టెముక్కలింకా అలవాటు పడలేదు. ఇక్కడ అన్నం దొరికినా ఎందుకో నాలిక్కి రుచించదు. పొట్టకూటికని వందల మైళ్ళు దాటి, ఊరుకాని ఊరు వచ్చే నాలాంటి వాళ్ళకి, కడుపు నిండేటట్టుగా తృప్తిగా భోం చేయడమే దూరమవుతుంది. ఛొలె, రాజ్మ, కుల్చ ఇవన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు వందలు ఖర్చుపెట్టి హోటల్లో తినేవాడిని . ఇప్పుడు రాత్రుళ్ళు ఆవకాయ, పప్పు తింటున్నట్టు కలలొస్తున్నాయి. కళ్ళు తెరిచేసరికి ఆవకాయ లేదు, కొసరి వడ్డించే అమ్మ లేదు. కరెంటు పోయినందుకు కుట్టె దోమలు తప్ప.


పొద్దున లేచి మరొ ఐదుగురితో షేర్ చేసుకునే గదిలో స్నానం చేయడానికి వెయిటింగ్, గడ్డం గీసుకోడానికి అద్దం కోసం వెయిటింగ్. నెత్తిన రెండు చెంబుల నీళ్ళోసుకొని, సరిగ్గా ఇస్త్రీ చేయని బట్టలు వేసుకొని బయటకి పరుగు. బస్సుకి ఇంకో పది నిముషాలు టైం ఉంటే పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్లో రెండు పరాటాలు హడావిడిగా నోట్లొ కుక్కుకుంటాను. ఆ టైం కూడా లేదంటె ఆఫీసుకి పరగడుపే. బస్సులో, ఆ జనంలో, చమటలు పడుతూ నిల్చున్నంతసేపు ఒకటే ఆలోచన – ఎక్కడో చలి ప్రదేశంలో, ఎవడో తెల్లవాడు వాడి వాతావరణానికి, సంస్కృతికి అనుగుణంగా కనిపెట్టిన టైని, నేను ఇంత ఉక్కపోతలో ఎందుకు కట్టుకున్నానా అని. ఉద్యోగం అంటే నీ కలలకు, ఆశలకు, ఆశయాలకు ఉరి అనటానికి అది సింబలేమో అని ఒక వెర్రి నవ్వు నవ్వుకుంటాను. 45 నిమిషాలు ప్రయాణించాక దిగి షేర్ ఆటో అందుకుంటాను. ప్రతివాడికి తొందరే కాబట్టి వాడు ఐదుగురు ప్రయాణించాల్సిన ఆటోలో పదిమందిని కుర్చోబెట్టినా ఎవడూ ఏమీ అనడు. డ్రైవరు పక్కన ఇరికి కూర్చొని ఆ మిగిలిన ప్రయాణం కాస్తా పూర్తిచేసే టైంకి తల ప్రాణం తోక్కొస్తుంది. ఆఫీసు వాడు నేను ఆఫీసులో చేసే పనికన్నా, నేను ఆఫీసుకి రావడానికి చేసే ప్రహసనం చూస్తే ఎక్కువ జీతం ఇస్తాడేమో. దిగి డబ్బులిచ్చాక ఆటోవాడు చిల్లర లేదంటాడు.


“మీకేంటి సర్, సాఫ్ట్ వేరు, దర్జా ఉద్యోగం మీకిదో లెక్కా,” అని నవ్వి వెళ్ళిపోతాడు.


“ఒరేయ్, నీకు నువ్వే రాజువి. నీకు బాసు లేడు, వాడితో మాటలు పడాల్సిన అవసరమూ లేదు. నాలాంటి కుక్క బతుకు కాదురా నీది,” అని వాడి కాలర్ పట్టుకుని అరవాలనిపిస్తుంది. కాని ఏమీ చేయలేక ఆ గుంపులో పడి ఆఫీసు లోపలికి నడుస్తాను. ఆరోజు శుక్రవారం అయితే కొందరి మొహాల్లో హుషారు కనిపిస్తుంది కాని మిగతా రోజుల్లో అందరూ ఎవడి తద్దినానికో వస్తునట్టుంటారు. అప్పుడప్పుడు నా జీవితం ఛాప్లిన్ తీసిన మోడ్రన్ టైంస్ లాంటి tragicomedy లాగా అనిపిస్తుంది. నేను ఉద్యోగంలో చేరిన రోజు తప్ప, ఎందుకు వెళుతున్నానురా బాబు అనుకోకుండా ఎన్నడు ఆఫీసు గుమ్మంలో అడుగు పెట్టలేదు.


ఊరు కాని ఊరొచ్చినప్పుడు మనుషులు మారతారు అంటే నేనెప్పుడు నమ్మలేదు. అలాంటి నాకు ఇంటిదగ్గర ఉన్నపుడు అన్నం విలువ తెలీలేదు, ఇక్కడికొచ్చాక తెలిసొచ్చింది. అలాగే తెలుగు భాష గొప్పతనం ఇంకా తెలీలేదేమో కానీ, దాని మీద ఎక్కడలేని మమకారం పుట్టుకొచ్చింది. ఇంటిదగ్గర గెబ్రియల్ గార్సియా మార్క్వెజ్, ఫ్యోదోర్ దోస్తోవ్స్కి పుస్తకాలు చదివే నాకు, ఇద్దరు రమణుల (ముళ్ళపూడి వెంకటరమణ, శ్రీరమణ) సాంగత్యం తోడైంది. అప్పటిదాకా సంగీతానికే కానీ వచనానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వని నేను వేటూరిగారి వీరాభిమానినైపోయాను.


అలా ఇంటివిలువ తెలుస్తున్న సమయంలోనే, ప్రపంచం పోకడ కూడ అర్థమవ్వసాగింది. మొదట్లో నా కో-వర్కర్స్ చూపించే కాన్ఫిడెన్స్, వాళ్ళ కంపొషర్ చూస్తే నాలో ఈర్ష్య కలిగేది. నాకు తెలియనిది వాళ్ళకేదో తెలుసని, అందుకే అంత సంతోషంగా ఉండగలుగుతున్నారని అనుకున్నాను. అందుకని వాళ్ళతో నేను కూడా తిరగడం మొదలు పెట్టాను. కాని వాళ్ళు తాగి మాట్లాడేది విని, నన్ను వేధించే ప్రశ్నలే వాళ్ళని కూడా వేధిస్తున్నాయని, జీవితం యొక్క అర్థం, దాని పరమార్థం వంటి పెద్ద పెద్ద ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం లేకనే వాళ్ళు తాగడం అనే మైకంలోకి దిగుతున్నారని బోధపడింది. కాని వాళ్ళు బయటకు ప్రదర్శించే ఆత్మవిశ్వాసం నటనో, స్వీయవంచనో ఇంకా అర్థం కాలేదు.


వాళ్ళతో అర్థరాత్రి వేళ సిగరెట్ల కోసం, చాయ్ల కోసం బయటకి వొచ్చినప్పుడు మరో ప్రపంచం కనబడింది- మోడ్రనైజేషన్ యొక్క మరో కోణం. చెత్త ఏరేవాళ్ళు, రోడ్లు వేసేవాళ్ళు, బ్రిడ్జిలు కట్టే వాళ్ళు. వీరంతా నేనుండే ప్రపంచంలోనే ఉంటారన్న నిజం కనబడింది. వాళ్ళు నా కోసం పనిచేస్తున్నా, ఒకరకంగా నేను వాళ్ళకోసం పనిచేస్తున్నా, మా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి తెలియదు. కాని ఇద్దరం ఈ సంసార చక్రంలో భాగస్వాములమే. ఈ నిరంతర పరుగు ఎక్కడికి, ఎందుకు అని తెలియకపోయినా ఇద్దరం పరిగెత్తాల్సిందే. నీట్స్చె, కెమూ, సార్త్రె వంటి 20వ శతాబ్దపు పాశ్చాత్య తత్వవేత్తలు చెప్పిన అబ్సర్డిస్మ్, నిహిలిస్మ్, ఎగ్సిస్టెన్షియలిస్మ్ నిరూపించే ఉదాహరణలు ప్రత్యక్షమయ్యాయి. యంత్రాల్ని చేసే పనిలో పడి మనం మనుష్యులం అన్న సంగతి మరిచామనిపించింది. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎవరన్నా నన్ను రిసొర్స్ అని అభివర్ణిస్తే వొళ్ళు మండిపోయేది. నేను ముడిసరుకుని కాను, మనిషిని అని అరవాలన్నంత ఉక్రోషమొచ్చేది. క్రమేపి అలవాటైపొయింది.


ఇలా జ్ఞానానికి-అజ్ఞానానికి, నిజానికి-జీవితానికి, ఆత్మస్థైర్యానికి-నిస్సత్తువకి నడుమ కొట్టుమిట్టాడుతున్న నాకు వెంకటప్పతో పరిచయమైంది. నేను, నా స్నేహితులు ఎక్కువగా వెళ్ళే సర్దార్ హోటల్లో వెయిటరుగా వచ్చాడతను. ఈ దేశంలో కూలి రైతైన తండ్రికి పుట్టి, సరైన పౌష్టికాహారం లేకుండా పెరిగి, చిన్నప్పటినుండి అయినదానికీ, కానిదానికీ మాటలు పడీపడీ తన హక్కుల కోసం కూడా పోరాడలేని పేదవాడు ఎలా ఉంటాడో, అలానే ఉండేవాడు. బీడీలు తాగి తాగి సొట్టలు పడిన బుగ్గలతో, సగం ఊడిన పళ్ళతో నవ్వుతూ పలకరించేవాడు. ఆ హోటల్ కి ఎక్కువమంది తెలుగువాళ్ళు రాకపోవడంతో నాకు, అతనికి బాగా పరిచయం పెరిగింది. తనది కర్నూలు జిల్లాలో ఒక చిన్న గ్రామం. వడ్డీ కట్టి వ్యవసాయం చేయలేక, పట్నంలో అయినా పని దొరుకుతుందేమో అని హైదరాబాదు తరలి వచ్చాడు. అటునుంచి నాసిక్, సూరత్, ఛంఢీగఢ్ లో కొన్నాళ్ళు పనిచేస్తూ నాలుగురాళ్లు ఎక్కువ సంపాదించుకుందామని ఢిల్లీ చేరాడు.


నేనెప్పుడు వెళ్ళినా ఆంధ్రాలో ఏం జరుగుతుందో అని సమాచారం అడిగేవాడు. అప్పుడప్పుడు తన చైనా ఫోన్ లోకి కొత్త పాటలు వేసివ్వమని కోరేవాడు. నేను వెళ్ళినప్పుడల్లా నానులో బటర్ ఎక్కువ వేయిస్తాడని నా స్నేహితులు జోకులు వేసేవాళ్ళు.


ఒకసారి, “మీరు ఎప్పుడు వచ్చినా చూస్తాను బాబు.. మీరు నలుగురొచ్చినా, ఆరుగురొచ్చినా పక్కవాళ్ళతో మాట్లాడడం కంటె మీ ఫోన్లు చూస్తూనే నవ్వుకుంటుంటారు, అస్తమానం ఏవో బటన్లు నొక్కుతూ ఉంటారు. అసలేముంది బాబు అందులో అంత?” అని అడిగేసరికి నవ్వేసాను. తనకి ఫేస్ బుక్ గురించి, ట్విట్టర్ గురించి ఎలా చెప్పాలో తెలీలేదు. నేను ప్రయత్నించినా తనకి అర్థం కాలేదు. కాని కాసేపటికి తను అన్నదాంట్లో తత్వం గ్రహించి, ఎంతమంది నడుమ ఉన్న, ఎంత కనెక్టెడ్ గా ఉన్నా మాలో ఇంకా జీవిస్తున్న ఒంటరితనాన్ని తలుచుకుంటె బాధేసింది.


వెంకటప్ప పరిచయమైన మొదటి రోజు నుండి నాకొక సంకోచం మొదలయ్యింది. ఆ హోటల్లో బిల్లు తీసుకొని కౌంటర్ దగ్గరే కట్టాలి. దానితో అతనికి టిప్ ఇవ్వడం ఒక సమస్యగా మారింది. తను డబ్బులకోసం ఇవన్నీ చేస్తున్నాడా లేక నిజంగానే మనవాడని అభిమానం చూపుతున్నాడా? నాకంటే వయసులో అంత పెద్దయిన వాడికి పది, ఇరవై చేతిలో పెడితే బాగుంటుందా? లేక ఈ నా సాయం తనకి నిజంగానే ఉపయోగపడుతుందా? నేను డబ్బులు ఇస్తే తాగి తందనాలు ఆడతాడా లేక పిల్లల చదువుకో, వాళ్ళ ఆరోగ్యానికో ఉపయోగిస్తాడా? ఇలాంటి ఆలోచనలన్నీ మనసులో మెదులుతూ ఉండేవి. అవసరం ఉంటే అడుగు అని చెప్దాం అంటే, రేపోమాపో నా తాహతుకు మించిన రొక్కం అడిగి నేను ఇవ్వలేనంటే పరువుపోతుంది. అందుకని ప్రతిసారి బిల్లు కట్టిన తరువాత తన వైపు కూడా చూడకుండా దొంగలా బయటకి పరుగుతీసేవాడిని.


ఇలా కొంతకాలం గడిచాక నేను ప్రాజెక్టు పని మీద బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. తిరిగొచ్చాక చాన్నాళ్ళకు గాని ఆ హోటల్ కు వెళ్ళడం కుదరలేదు. కానీ నేను వెళ్ళిన రోజు వెంకటప్ప కనిపించలేదు. ఏమైందని కనుక్కుంటే నెల క్రిందట చనిపోయాడని చెప్పారు. నేను నివ్వెరపోయాను. అతనికి క్షయట. తన ఇంటి చిరునామా కనుక్కొని, అతని కుటుంబాన్ని ఒకసారి పరామర్శిద్దామని బయలుదేరాను. తండ్రి లేని ఇంట్లో ఆ పిల్లలు తిండితిప్పలు లేకుండా ఉంటారని, వాళ్ళావిడ పసుపు కుంకుమలు లేకుండ ఒక మూల కూర్చొని ఏడుస్తుంటుందని.. వాళ్ళకి ఇవ్వడానికి పర్సులోంచి వెయ్యిరూపాయలు తీసి పక్కకి పెట్టి, వాళ్ళని ఎలా పలకరించాలో ఆలోచిస్తూ వాళ్ళ గుమ్మం ముందు నిలబడ్డాను.


వెంకటప్ప తెలుసా అంటే ఒక పదేళ్ళ కుర్రాడు లోపలికి రమ్మని కూర్చోబెట్టి నీళ్ళిచ్చాడు. ఇల్లు ఒక పేద కాలనీలో చిన్నదైనా శుభ్రంగా, కళగా కనిపించింది. లోపలి నుండి ఒకావిడ వచ్చింది. లేచి నించుని నమస్కరించాను. నాకు వెంకటప్ప ఎలా తెలుసో చెప్పాను. ఇప్పుడే విషయం తెలిసింది అన్నాను. రక్తం కక్కుకుంటే ఆస్పత్రిలో చేర్చారని, డబ్బులులేక, ప్రభుత్వాస్పత్రిలో సరిగ్గా వైద్యం అందక మూడు రోజుల్లో పోయాడని చెప్పిందావిడ. ఆవిడ గొంతులో నిరాశ, నిస్పృహల కోసం వెతికాను. దొరకలేదు. ఎలాంటి నాటకీయత, తొట్రుపాటు లేక, నిదానంగా జరిగింది జరిగినట్లు చెప్పింది. ఆవిడేదో బట్టల ఫాక్టరీలో పనిచేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. ఆ ముగ్గురు పిల్లలతో ఆవిడ్ని అలా చూసేసరికి ఎందుకో మా అమ్మ గుర్తొచ్చింది. పిల్లలపైన అదే ప్రేమ, జీవితాన్ని ఎదుర్కొనే అదే ధైర్యం. వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళిన నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.


ఏదన్నా అవసరం ఉంటే కబురు చేయమని బయటకి పరుగు తీసాను. జీవితం అంటేనే భయం వేసింది. రేపు నేనిక్కడ రోడ్డు మీద మూర్ఛపడి పోతే నేను తాగి పడిపోయాను అనుకుంటారు గాని, ఒక్కడు కూడా నోరు తెరిచి గుక్కెడు నీళ్ళు పోయడు. నేనేదో రోగం వచ్చి పోతే నా ఇంట్లో వాళ్ళు రావడానికే ఒక రోజు పడుతుందన్న ఆలోచన రాగానే ఒళ్ళు జలదరించి పోయింది. మది నిండా ఇవే ఆలోచనలతో ఎక్కడికి నడుస్తున్నానో తెలియదు కాని చాల వేగంగా నడుస్తున్నాను. హఠాత్తుగ గుడిగంటల శబ్దం వినబడింది. పక్కకు చూస్తె వెంకటేశ్వరస్వామి గుడి, మంగళహారతి వేళ. బూట్లు విడిచి నెమ్మదిగా లోపలికి నడిచాను. పెద్దగా జనంలేరు. వెళ్లి దేవుడి ముందు నిలబడ్డాను. అప్రయత్నంగా చేతులు జోడించాను. కళ్ళలోంచి నీళ్ళు కారడం మొదలైంది. గుండెబరువు తీరేదాక వెక్కి వెక్కి ఏడ్చాను- ఆ దేవుడి సాక్షిగా.
*

--

An appreciate review of the story in Saaranga Magazine.

అస్తిత్వం: శిరీష్ ఆదిత్య


ఢిల్లీ నగరంలో ఒంటరిగా వుంటున్న ఓ తెలుగు యువకుడు తెలుగు మాట్లాడే ఓ హోటల్ సర్వర్ తో పరిచయం పెంచుకుంటాడు. ఓనర్ కి తెలియకుండా అతనికి టిప్ ఇవ్వలేని చిన్న డైలమా. అది ఇవ్వకముందే సర్వర్ చనిపోవటం – ఇదీ కథాంశం. జీవితం తాలూకు అభద్రత, అజ్ఞానం, అనిశ్చితీ అసలే కుదిపేస్తున్న ఆ సమయంలో – వెంకటప్ప మరణం జీవితపు క్షణికత్వాన్ని కథకుడికి ఆవిష్కరింపజేసి, నాస్తికుడిగా ఉన్నవాడిని గుడి మెట్ల మీద నిలబెడుతుంది. ఈ కథ కూడా ముందే చెప్పినట్లు మంచి భాష, కథనం వల్ల చదివించేస్తుంది. చివర్లో యువకుడు వేసుకునే ప్రశ్నలు, మధ్యలో వెంకటప్ప వేసే ప్రశ్నలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. కథాంశంలో మరి కొంత కసరత్తు చేసివుంటే కథకు కండపుష్టి కలిగుండేది.

1 comment:

పూడూరి రాజిరెడ్డి said...

ఈ కథ- ముందయితే కథ అనుకోలేదు, నాన్ ఫిక్షన్/మ్యూజింగ్ అనే మొదలుపెట్టాను- నాకు నచ్చింది. అయితే, ఇది నచ్చడం కన్నా ముఖ్యవిషయం, 'శిరీష్ ఆదిత్య' పేరుతో వచ్చే స్టఫ్ మిస్సవకుండా చదవదగ్గది, అన్న నమ్మకం కలిగించింది.